– మోడీ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శ
లండన్ : యూరప్ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇండియా-భారత్ పేరు మార్పు వివాదంపై మోడీ సర్కారు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. విపక్ష ఇండి యా కూటమిని చూసి పాలక బీజేపీకి వణుకు మొదలైందని, అందుకే దృష్టి మళ్లించే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇండియా.. అనగా భారత్ అనేది సరైన పదమ ని, మనం ఎవరనేది ఇది తెలియచెబుతుందని అన్నారు. అయితే ప్రభుత్వం లో భయం పట్టుకుందని, నా దృష్టిలో పేరు మార్పు వ్యవహారం భయం నుంచి వచ్చిన స్పందన అని రాహుల్ పేర్కొన్నారు. బెల్జియంలోని బ్రసెల్స్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ సర్కారుపై తమ పార్టీ అదానీ వ్యవహరం, క్రోనీ క్యాపిటలిజంపై విరుచుకుపడినప్పుడల్లా ఆయన ప్రజల దృష్టిని మరల్చేందుకు సరికొత్త డ్రామాతో ముందుకొస్తారని విమర్శించారు. విపక్ష కూటమి పేరు ఇండియా ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోందని అన్నారు. ఇండియా కూట మి పేరు ప్రధానిని చికాకు పెడుతున్నదని, అది ఎంతగా అంటే దేశం పేరు మార్చేటంతగా అంటూ వ్యాఖ్యానించారు. దేశాన్ని ఇండియా-భారత్ అని రెండు పేర్లతో పిలవడం అద్భుతమైన ఆలోచన అని రాహుల్ పేర్కొన్నారు. ఇండియా రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం పేర్కొందని, తన సభ్యుల తో సంప్రదింపులు జరపడం ద్వారా సమాఖ్యను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. దేశ భవితవ్యాన్ని మార్చేందుకు కాషాయ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని కేంద్రీకృతం చేయాలని, సంపద కొద్దిమందికే పరిమితం చేయాలని, భారత ప్రజల మధ్య సంప్రదింపులను నియంత్రించాలన్నది బిజెపి విజన్ అని దుయ్యబట్టారు. దేశంలో గాంధీ, గాడ్సే విజన్‌ల మధ్య పోరాటం జరుగు తున్నదని రాహుల్ అభివర్ణించారు. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకుంటూ ప్రజల గొంతుకగా నిలవాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని అన్నారు.