భారత్‌ బోణీ

– తొలి టీ20లో బంగ్లాపై గెలుపు
– మీర్పూర్‌ (బంగ్లాదేశ్‌)

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (54 నాటౌట్‌, 35 బంతుల్లో
6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. స్లో వికెట్‌పై పరుగుల వేట గగనమైన వేళ.. ఛేదనలో నాయకురాలు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిసింది. వైస్‌ కెప్టెన్‌ స్మృతీ మంధాన (38, 34 బంతుల్లో 5 ఫోర్లు) సైతం రాణించటంతో బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో భారత అమ్మాయిలు ఘన విజయం సాధించారు. 115 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 16.2 ఓవర్లలోనే ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన టీమ్‌ ఇండియా టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు 114 పరుగులకే కట్టడి చేశారు. పూజ, మిన్నూ, షెఫాలీ వర్మలు తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో ఎవరూ అంచనాలకు తగినట్టు ఆడలేదు. టాప్‌ ఆర్డర్‌లో రాణి (22), షబాన (23).. మిడిల్‌ ఆర్డర్‌లో అక్తర్‌ (28) చెప్పుకోదగిన ప్రదర్శన చేశారు. 20 ఓవర్లలో బంగ్లాదేశ్‌ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులే చేసింది. ఛేదనలో తొలుత టీమ్‌ ఇండియా సైతం తడబడినా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఇన్నింగ్స్‌తో పరుగులు సులువుగా వచ్చాయి!. భారత్‌, బంగ్లాదేశ్‌ మహిళల రెండో టీ20 మంగళవారం మీర్పూర్‌లోనే జరుగనుంది.

Spread the love