మణిపూర్‌ మంటల్లో ‘వెలుగుతున్న’ భారత్‌

Manipur is India 'lit' in flames

భారతదేశంలో అభివృద్ధి వెలిగిపోతోందని చెప్పేవారి సంఖ్య పెరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్ల స్వదేశీ నినాదంతో శివతాండవం చేస్తున్నవారు భారత్‌ వెలుగుతోందని గొంతు చించుకుని అరుస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీని విమర్శించిన వారిని సోషల్‌ మీడియా ద్వారా బండబూతులు తిడుతూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ మూకలన్నీ మణిపూర్‌ మారణహోమాన్ని, మహిళలపై జరిగిన నీచ నికృష్టదాడిని ఏవిధంగా సమర్థించుకుంటాయో? సిగ్గుశరం వదిలేస్తే రాజభోగం పొందవచ్చనే సామెత ఉంది. ఆ రెండూ వదిలేసిన ఆరెస్సెస్‌-బీజేపీ మూర్ఖులు ఏమైనా చెప్పగలరు. కానీ ఈ దేశంలో, ప్రపంచంలో మానవత్వమున్న మనుషులుగా జీవిస్తున్న కోట్లమంది ప్రజలు మణిపూర్‌ను, భారత్‌ను చూసి ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఆవేదన చెందుతున్నారు. భారత సంస్కృతీ సాంప్రదాయాల్ని గొప్పగా చెప్పుకునే ప్రపంచ దేశాల పత్రికలు ఎటువంటి హెడ్డింగులు పెట్టాయో చూడండి.
ప్రపంచ మీడియాలో మణిపూర్‌ ఘోరకలిని చూసాకగానీ మోడీ మెదడులో చలనం కలిగిందా? అంత వరకు మన మీడియా, మన పాలకులు మొద్దు నిద్రపోతున్నారా? అంతేకాదు మనం దేవుళ్లుగా కొలిచే ఈ దేశంలో పుట్టిన బాబాల రాసలీలలు, బాబా గుర్వీత్‌సింగ్‌ (డేరాబాబా) వందలమంది ఆడపిల్లల మానప్రాణాలు బలిగొన్న విషయం అన్ని దేశాల ప్రజలు చూసారు. మీడియా ద్వారా గుజరాత్‌లో జరిగిన మారణహౌమం, ఆరోజు బిల్కిస్‌ బానో కుటుంబంపై జరిగిన దాడి, 14మందిని ఊచకోత కోయడం వల్లనే భారత్‌ వెలిగిందేమో? గత తొమ్మి దేండ్లుగా యూపీలో కతువా, ఉన్నావో ఘటనలవంటి అనేక మరణమృదంగాలు మన చెవుల్లో మారుమోగాయి. ఈ అల్లర్లలో లైంగిక దాడులకు పాల్పడినవారు, సాక్షుల్ని బెదిరించడం, చంపించడం జగమెరిగిన సత్యం. ఇటీవల 3నెలల నుండి జరుగుతున్న రెజ్లర్ల పోరాటం. అంతర్జాతీయ రెజ్లింగ్‌ బాడీ (డబ్ల్యుఎఫ్‌ఐ) మందలించేవరకు మన ప్రధానినోరు విప్పని స్థితి. ఒక స్త్రీ తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే వెంటనే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయాలని చట్టాలు చెపుతున్నాయి. కానీ పదిమంది యువతులు ఒకసారి కాదు, ఎన్నో రోజులుగా, మరెన్నోసార్లు మాపై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసినా రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. నెలల తరబడి ఆడవాళ్లు ఢిల్లీ నగరం రోడ్లపై కూర్చుని ఎలుగెత్తి అరిచినా మన ప్రధాని, హోంమంత్రి చెవులకు వినిపించలేదు. దేశప్రజలతో పాటు ప్రపంచ మీడియా కూడా ముఖాలపై ఉమ్మివేస్తే కానీ వీళ్లు చలించరన్నమాట. పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. దీన్నిబట్టి ఏమర్థమవుతుంది?
మణిపూర్‌ కొండిపాంతాలలో నివసించేది గిరిజన ప్రజలు. వాళ్ళెంత కొట్టుకు చచ్చినా ఎవరు చూస్తార్లే అని పాలకుల భావం. వీళ్ళ సమస్యలు గాలికొదిలేసి దేశ ప్రధాని విదేశాల్లో చక్కర్లు కొడుతూ, ఖరీదైన విందులారగిస్తూ, ఈ దేశంలో వెలగబెడుతున్న రాచకార్యాల్ని గొప్పగా చర్చించి వచ్చారు. పాపం పండింది. మణిపూర్‌ మంటల వెలుగు ప్రపంచమంతా చూసారు. మర్డర్లు, మానభంగాలే కాదు, మన దేశంలో ఇంకా చాలా వింతలున్నాయి. ఆడవాళ్ళను నగంగా ఊరేగించగల సాంప్రదాయం కూడా మా గొప్పే చూడండన్నారు. ఏ పోరాటాల్లోనైనా ముందుగా బలయ్యేది మహిళలే. రెండు తెగల మధ్య భూమి సమస్యలపై సాగుతున్న పోరాటం 200మంది ప్రాణాలు బలిగొన్నది. ఇందులో మహిళలున్నారు. భర్తల్ని, కొడుకుల్ని, సోదరుల్ని పోగొట్టుకుని ఏడుస్తున్న వారు కూడా మహిళలే. ఇండ్లతో పాటు పెంచుకున్న గొడ్డుగోదా పోగొట్టుకుని, తిండిగింజలకు దూరమై, తిండీ, నిద్రా లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం గడుపుతున్న మణిపూర్‌ ప్రజల్ని, మహిళల్ని చూసాకైనా భారతదేశంలో మహిళలు కండ్లు తెరవాలి. ఇంత రాక్షస మనస్తత్వం, భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్న బీజేపీని ఓడించకపోతే, అది చెప్పే నీతులు విని ఇదే మన నిజమైన హిందూ సంస్కృతి అని నమ్మితే, మనల్ని కాపాడటానికి ఏ దేవుడూ దిగిరాడు. ఎందుకంటే మనం కొలిచే రాముడు నిండునెలలతో ఉన్న భార్యను అడవుల్లో వదిలేశాడు. రావణాసురుడు బలవంతంగా ఎత్తుకుపోయినపుడు అగ్నిప్రవేశం చేయించాడు. మరొక శృంగార పురుషుడు కృష్ణుడు. ఆయనకీ చీరలెత్తుకెళ్ళిన అలవాటు ఉందికదా! దాన్ని మన గొప్ప చర్యగా పూజిస్తున్నామాయే. మరి సతీ అనసూయను బట్టలిప్పి ఇనుముతో గుగ్గిళ్లు వండితేనే నువ్వు పతివ్రతవన్న వాళ్లు మనకు దేవుళ్లాయే. అందుకే ఈ దేశంలో స్త్రీల బట్టలూడదీయడమే సంస్కృతిగా భావించే మూర్ఖులు పెరుగుతున్నారేమో ఆలోచించండి.
బి. హైమావతి
9391360886

Spread the love