ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేసిన టీమిండియా

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిక్యం పెంచుకుంటోంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నిన్న మొదటి టెస్టు ప్రారంభమైంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకుంది. తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌటైంది.  అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నేడు రెండో రోజు ఆటలో లంచ్ తర్వాత 300 మార్కు చేరుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేసిన టీమిండియా క్రమంగా ఆధిక్యం పెంచుకుంటోంది.   ఇవాళ్టి ఆటలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా ఆడుతున్న రాహుల్ 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 86 పరుగులు చేశాడు. అంతకుముందు, రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైస్వాల్ 74 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 80 పరుగులు చేశాడు. జైస్వాల్ ను ఇంగ్లండ్ పార్ట్ టైమ్ బౌలర్ జో రూట్ అవుట్ చేశాడు.  కెప్టెన్ రోహిత్ శర్మ 24, శుభ్ మాన్ గిల్ 23, శ్రేయాస్ అయ్యర్ 35 పరుగులు చేశారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 71 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు కాగా… ఇంగ్లండ్ పై 54 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా 40, కేఎస్ భరత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Spread the love