నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ టై కాగా.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (45; 65 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకోగా.. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (96; 102 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (59; 82 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. కమిందు మెండిస్ (23) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ (3/54) అదరగొట్టాడు. కుల్‌దీప్ యాదవ్, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించారు. నిశాంక, అవిష్క జోడీ తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. హాఫ్ సెంచరీకి చేరువైన నిశాంక.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత కుశాల్ మెండిస్‌తో కలిసి అవిష్క ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అక్షర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి అర్ధ శతకం అందుకున్న అవిష్క క్రమంగా జోరు పెంచాడు. అతడు సిరాజ్ వేసిన 29వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. సెంచరీకి చేరువైన అవిష్కను రియాన్ పరాగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పరాగ్‌కు వన్డేల్లో ఇది తొలి వికెట్. రియాన్ తర్వాతి ఓవర్‌లో చరిత్ అసలంక (10)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపగా.. సదీర విక్రమార్క (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. జనిత్ (8)ని వాషింగ్టన్ సుందర్, దునిత్ వెల్లలాగే (2)ని రియాన్ పరాగ్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపారు. నిలకడగా ఆడి అర్ధ శతకం పూర్తి చేసుకున్న కుశాల్ మెండిస్.. కుల్‌దీప్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు చిక్కాడు.