– ఈ పరిస్థితి చూస్తే నాకు భయమేస్తోంది : సీఎం కేసీఆర్
– నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం
– త్వరలోనే మహారాష్ట్రలో పరివర్తన వస్తుంది..
– అది దేశమంతా పాకుతుందంటూ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒక గమ్యం.. లక్ష్యం లేని దిశగా భారతదేశం పయనిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి చూస్తే తనకు భయమేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గురువారం ఆయన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలోనూ, ఆ తర్వాత మీడియాతోనూ కేసీఆర్ మాట్లాడారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే కొందరికి లక్ష్యంగా మారిందనీ, ఈ రాజకీయ తంత్రంలో దేశం చిక్కుకుపోయిందని వాపోయారు. ప్రతీ ఎన్నికల్లోనూ నేతలు కాదు.. జనం గెలవాలని అన్నారు. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుందని చెప్పారు. ప్రజలు చంద్రుడు, నక్షత్రాలను కోరట్లేదనీ, నీళ్లు ఇవ్వమని మాత్రమే వారు కోరుతున్నారని తెలిపారు. ఔరంగాబాద్‌లో ఎనిమిది రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందంటూ అక్కడి ప్రజలు చెబుతున్నారని గుర్తు చేశారు. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రమని తెలిపారు. ఇక్కడి నుంచి వివిధ పార్టీలకు చెందిన వారు ఎంతో గొప్ప నేతలుగా ఎదిగారనీ, సీఎంలు అయ్యారని చెప్పారు. కానీ ప్రజల జీవితాల్లో, రాష్ట్ర పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదని గుర్తు చేశారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడింది.. కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. కానీ పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనమంటూ ప్రశ్నించారు. దేశంలో దళితులు, ఆదివాసీల పరిస్థితి దారుణంగా ఉందని సీఎం ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పరిస్థితులు మారనంత కాలం దేశం అభివద్ధి చెందబోదని అన్నారు. అందువల్ల దేశం మారాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అనేక రాష్ట్రాల్లో వేల టీఎంసీల నీరు వథాగా సముద్రంలో కలుస్తోందనీ, ప్రపంచంలోనే అత్యధికంగా మన దగ్గరే ఎక్కవశాతం సాగుకు యోగ్యమైన భూమి ఉందని చెప్పారు. మనం తలుచుకుంటే దేశంలోని ప్రతీ ఎకరానికి సాగునీరు ఇవ్వొచ్చని తెలిపారు. ఎన్నో వనరులు సమద్ధిగా ఉన్నా… ప్రజలకు ఎందుకీ కష్టాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్, ఉచిత నీరుతో తెలంగాణలో సాగును పండుగలా మార్చామని వివరిం చారు. ఇప్పుడు తెలంగాణ వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటే సిందనీ, రాష్ట్రంలో పండిన పంటంతా ప్రభుత్వమే కొంటో ందని చెప్పారు. పంట సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాగునీటి కోసం బిందెలు పట్టుకుని తిరిగే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేదని సీఎం వివరించారు. రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని పారద్రోలాలా..? వద్దా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను డిజిటలైజ్ చేయటం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేశామన్నారు. గతంలో తెలంగాణలో మహారాష్ట్ర కంటే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగేవని తెలిపారు. ఇప్పుడు సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ లభిస్తోందని చెప్పారు. దీంతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయని స్పష్టం చేశారు. తెలంగాణాలో మాదిరిగా పథకాలు అమలు చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందంటూత కొందరు మరాఠా నేతలు అంటున్నారనీ, అలా చేస్తే ఆయా నేతలే దివాలా తీస్తారు..తప్ప ప్రజలు కాదని వ్యాఖ్యానించారు. తమ పథకా లను అమలు చేస్తే మహారాష్ట్ర ప్రజలు దీపావళి జరుపు కుంటారని చెప్పారు. మహారాష్ట్రకే వెళ్తున్నారు.. మా మధ్య ప్రదేశ్‌కు రావట్లేదంటూ అక్కడి ప్రజలు మమ్మల్ని అడుగు తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకూ బీఆర్‌ఎస్ పోరాడుతోందని తెలిపార. ఆ రాష్ట్రం నుంచి అనేక మంది నేతలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు.. త్వరలోనే లక్షల సంఖ్యలో సభ్యత్వాలు నమో దవుతాయంటూ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో త్వర లోనే పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుం దని పేర్కొన్నారు. త్వరలో పుణె, ఔరంగబాద్‌లో కూడా బీఆర్‌ఎస్ ఆఫీసులను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు.