రాబోయే ఎన్నికల్లో ‘ఇండియా’ వర్సెస్‌ కార్పొరేట్‌

In the upcoming elections 'India' Vs.Corp– భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? లేదా?
– తేల్చనున్న 2024 ఎలక్షన్లు
– రిస్క్‌ తీసుకుంటాం…. దేశాన్ని కాపాడుకుంటాం
– రక్తం పీల్చడం అలవాటుగా మారిన డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ :ఏఐఎఫ్‌ యుసీటీఓ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే సార్వత్రిక ఎన్నికలు భారతదేశం ఉంటుందా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం మిగులుతుందా? అనే విషయాలను తేల్చనున్నది. రిస్క్‌ ఎంతైనా తీసుకుంటాం. ఈ దేశాన్ని కాపాడుకుంటాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాం. 2024 ఎన్నికలు ఇండియాకు, కార్పొరేట్లకు మధ్య జరిగే యుద్ధమే. ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. కార్పొరేట్లు కొద్ది మందే. వారికి ఓటమి తప్పదు. ఇండియా గెలుపు తథ్యం. భారతదేశం కోసం, భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేధావుల చర్చ హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైంది. ఈ పోరాటంలోకి అన్ని వర్గాల మేధావులు కదిలి రావాలి…’ అని ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ, కాలేజ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఏఐఎఫ్‌యుసీటీఓ) ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.
ఏఐఎఫ్‌యుసీటీఓ ఉపాధ్యక్షులు డాక్టర్‌ రత్న ప్రభాకర్‌ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మణిపూర్‌లో జాతుల మధ్య హింస-మేధావుల సమీక్ష’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో 600 మంది చంపబడి, ఆరు వేల ఇండ్లు ధ్వంసమై, 80 వేల మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. వంద రోజుల వరకు నోరు విప్పని పీఎం మోడికి, అవిశ్వాస తీర్మానంతో సమాధానం చెప్పక తప్పలేదని వివరించారు. అప్పటికీ మోడీ భారతదేశ చరిత్రలో మణిపూర్‌ మహిళలు, బాలికల పట్ల ఎన్నడూ లేని విధంగా దుర్ఘటనలు జరిగితే దాన్ని మిగిలిన రాష్ట్రాల్లో ఘటనలను కలుపుతూ సమస్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. మణిపూర్‌ లో అడవిని అమ్మేందుకే ఆట మొదలెట్టారనీ, ఇప్పటికే 1,100 ఎకరాల కుకీల భూమిని ఆదానికి అప్పగించారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్న బీజేపీ సర్కార్‌ యూనివర్సిటీల అమ్మకానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానంతో 2035 తర్వాత ప్రభుత్వ నిధులతో నడిచే యూనివర్సిటీలు మిగలవని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే గ్రాంట్లకు బదులుగా రుణాలిస్తున్నారని గుర్తు చేశారు. మేధావులు సమాజానికి నిజాలు చెప్పాల్సిన సమయమిదేనని సూచించారు. ఢిల్లీలో వచ్చే నెల 13న జరిగే నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
తప్పుడు ప్రచారం …తిప్పికొడదాం : ప్రొఫెసర్‌ అందె సత్యం
సమస్యను సృష్టిస్తున్న వారికి ఆ సమస్యను సామాన్యులు సమర్థించుకునే యంత్రాంగం నడపడంలో కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వాలు విజయవంతమైయ్యాయని జన విజ్ఞాన వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అందె సత్యం తెలిపారు. మణిపూర్‌ ఘటనల తర్వాత మెహతీలపై సానుభూతి పెరిగేలా 53 శాతమున్న మెహతీల చేతిలో 10 శాతం మాత్రమే భూమి ఉందని ప్రచారం చేశారని గుర్తుచేశారు. అదే మెహతీల చేతిలో ఉన్న భూమి అమ్ముకోవడానికి వీలైనదనీ, కుకీలు అమ్ముకోవడానికి వీలులేని భూమిలో ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టారని తెలిపారు. కుకీలు బర్మా నుంచి, నాగాలు నాగాలాండ్‌ నుంచి మణిపూర్‌కు వచ్చారనే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలను అంతే వేగంగా తిప్పికొట్టాలని సూచించారు. ప్రజల గొంతు ఎకె 47 కన్నా బలవంతమైందనీ, ప్రజా చైతన్యానికి ముందు యూరోప్‌లో చర్చి రాజకీయాలను శాసించేదని తెలిపారు. ఇస్లామిక్‌ దేశాల్లో షియా-సున్నీల మధ్య గొడవలను ఎక్కుపెడుతూ అమెరికా సామ్రాజ్యవాదం ఏలుతున్నదని చెప్పారు.
ఈ సమావేసంలో ప్రొఫెసర్‌ వెంకటరమణ కీలకోపన్యాసం ఇవ్వగా, కవి, ముంతాజ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యాకూబ్‌, ఒయు, యుజీసీ డీన్‌ ప్రొఫెసర జి.మల్లేశం, వరల్డ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎ.కె.మహంతి, డాక్టర్‌ శంకర్‌ నాయక్‌, ఏఐఎప్‌ యుసీటీఓ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వి.రవి, ప్రొఫెసర్‌ అమంచి నాగేశ్వర్‌ (ఒయు), డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు (సిటీ కాలేజ్‌), టీఆర్‌ఏసీటీఏ చైర్మెన్‌ డాక్టర్‌ జగన్‌ మోహన్‌, టీడీఎల్‌ఎఫ్‌ అధ్యక్షులు డాక్టర్‌ కిషోర్‌ కుమార్‌, ఫోరం ఫర్‌ డెమోక్రటిక్‌ థింకర్స్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పట్టా వెంకటేశ్వర్లు, డాక్టర్‌ నీరజ (టీజీసీజీటీఏ), డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ (టీజీసీటీఏ), డాక్టర్‌ రాజేశ్వరరావు (బీజేఆర్‌ కాలేజ్‌), డాక్టర్‌ వాసుదేవ రెడ్డి (టీజీసీజీటీఏ), డాక్టర్‌ రమేశ్‌ (సిటీ కాలేజ్‌), డాక్టర్‌ ప్రభాకర్‌ (జీడీసీ, ఖైరతాబాద్‌) తదితరులు మాట్లాడారు.

Spread the love