నవతెలంగాణ -హైదరాబాద్: వరల్డ్ కప్ ముందు భారత జట్టు అద్బుత విజయం సాధించింది. ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదోసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(27), ఇషాన్ కిషన్(23) నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టుకు సిరాజ్ చుక్కలు చూపించాడు. ఈ స్పీడ్‌స్టర్ 6 వికెట్లతో లంకను చావుదెబ్బ కొట్టాడు. దాంతో, లంక 50 పరుగులకే కుప్పకూలింది. పాండ్యా వేసిన 16వ ఓవర్లో వరుస బంతుల్లో ప్రమోద్ మదుషాన్ (1), పథిరన(0) ఔటయ్యారు. దాంతో 50 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. వన్డేల్లో శ్రీలంకకు ఇదే రెండో అత్యల్ప స్కోర్.