– నాలుగు దశల ఎన్నికలయ్యాక ఫలితాలు అనుకూలం : ఖర్గే
లక్నో: నాలుగు దశల ఎన్నికలు ముగిసేసరికి విపక్ష ఇండియా కూటమి బాగా బలపడిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ఆయన లక్నోలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి 10 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ”నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇండియా బ్లాక్ బలపడింది. జూన్ 4వ తేదీన ప్రజలు మోడీని సాగనంపేందుకు సిద్ధమయ్యారు. మా వేదికే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటానికి ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. మీ భావజాలానికి తగిన నాయకుడిని ఎన్నుకొనే అవకాశం ఎక్కడుంది. ఎవరైనా బీజేపీ అగ్రనాయకుడు నాయకుడు పోటీ చేస్తుంటే.. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకొంటున్నారు. హైదరాబాద్‌లో ఓ మహిళా అభ్యర్థి బుర్ఖాలు తీయించి ఓటర్లను పరీక్షిస్తోంది. దీనిని ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం అంటామా..?” అని ఖర్గే ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ఇండియా వేదిక యూపీలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ”మీడియాకు జూన్ 4 నుంచి స్వర్ణయుగం ప్రారంభం కానుంది. బీజేపీ తన ప్రతికూల ప్రచారంలో తానే ఇరుక్కొంది. ఇండియా బ్లాక్ యూపీలో 79 స్థానాల్లో విజయం సాధించనుంది” అని పేర్కొన్నారు.