– ఎమర్జెన్సీ కన్నా అధ్వాన పరిస్థితులు
– దారితప్పిన మెయిన్ స్ట్రీమ్
– ఇండిపెండెంట్ జర్నలిజానికి పెరుగుతున్న ఆదరణ :
– ”ద వైర్” తెలుగు వెబ్‌సైట్ ఆవిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”మోడీ గుప్పెట్లో భారతీయ మీడియా బందీ అయ్యింది. గత పదేండ్లుగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయి. ఎమర్జెన్సీ కన్నా అధ్వాన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ప్రధాన మీడియా దారితప్పింది, అది ప్రభుత్వాలకు అంట కాగుతూ అవాస్తవాలను, అసాంఘీక కార్యకలాపాలను పోటీ పడి వ్యాప్తి చేస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్ యూనివర్శి టీలు ఈ ధోరణికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వాస్తవాలను వెలికితీస్తున్న ‘ద వైర్’ వెబ్‌సైట్ పదేండ్లుగా దేశంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది” అని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. ”ద వైర్ తెలుగు ప్రారంభ సభ” కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కొండూరి వీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన సీనియర్ పాత్రికేయులు, పీఎంవో మాజీ సలహాదారు సంజరుబారు మాట్లాడుతూ భారతీయ మీడియా ప్రభుత్వాలకు మద్దతుగా నిలుస్తూ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అడ్డదారులు తొక్కుతోంద ని ఆరోపించారు. 2024 ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఒపినీయన్ పోల్ నుంచి మొదలుకుని ఎగ్జిట్‌పోల్ వరకు ప్రధాన మీడియా సర్కార్‌కు వెన్నుదన్నుగా నిలిస్తే, ఇండిపెండెంట్ మీడియా మాత్రం క్షేత్రస్థాయి వాస్తవాలను వెల్లడించిందని గుర్తు చేశారు. యాజమాన్యాలు జర్నలిస్టులను వార్తలు సేకరించే యంత్రాలుగానే చూస్తున్నాయని వాపోయారు. వారి వృత్తి స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛను హరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మీడియా సంక్షోభంలోకి నెట్టివేయబడిన తరుణంలో 2015లో వచ్చిన ‘ది వైర్’ ప్రజల పక్షాన నిలిచిందని కొనియాడారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో మౌలిక విలువలపై ఒక ప్రణాళికాబద్ధంగా దాడి జరుగుతోందని అన్నారు. ఈ దాడి నుంచి దేశాన్ని కాపాడేందుకు పత్రికలతో పాటు పౌర సమాజం తమదైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దురదృష్ట వశాత్తూ మీడియా ఆ పాత్రనుంచి తప్పుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హాల్లో తొక్కిసలాట ఎలా జరిగిందనే దానిపై పెట్టిన దృష్టి పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, మేధావులు, నిపుణులు దేశాన్ని వదిలి వెళ్లడం లాంటి అంశాలపై మీడియా తన వంతు పాత్రను ఎందుకు పోషించడం లేదని ప్రశ్నించారు. ది వైర్ వ్యవస్థాపకులు సిద్ధార్థ వరదరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల మద్దతుతో పదేండ్లుగా వైర్‌ను నిఖార్సైన మీడియా సంస్థగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ప్రశ్నిస్తేనే భరించలేని ప్రధాని ఈ దేశాన్ని ఏలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పదేండ్ల కాలంలో ఎన్నడూ ప్రెస్‌మీట్ పెట్టి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది లేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ తాము చెప్పిందే రాసుకోవాలనే ధోరణి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని అన్నారు. వైర్ మాత్రం మోడీ నుంచి మొదలుకుని అందరి తప్పులను ఎత్తి చూపుతూ నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుందని తేల్చి చెప్పారు. అంబేద్కర్ యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు రాజకీయ సంచనాలకు మారుపేరని అన్నారు. ఇక్కడ వార్తా కథనాలకు కొదవలేదనీ, అయితే వాటికి సరైన వేదిక లేదని అన్నారు. ఆ లోటును వైర్ తెలుగు ఎడిషన్ తీర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రియాజ్ మాట్లాడుతూ పోరాటాలకు, ఉద్యమాలకు నెలవైన తెలుగు నేలపై వైర్ చేస్తున్న ప్రయత్నానికి తమ వంతు సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. వైర్ సంపాదకులు సీమా చిస్తి, ఎం.కె.వేణు మాట్లాడుతూ భారతీయ మీడియా సినిమా, క్రికెట్, నేరాలు అనే మూడు అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతలను ప్రజా సమస్యలకు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. 2024లో మోడీకి పూర్తి మెజార్టీ వస్తే దేశంలో మీడియాను ఉక్కుపాదంతో అణిచి వేసేవారని గుర్తు చేశారు. వాస్తవాలను రాస్తున్న వైర్‌పై అదానీ, అంబానీ లాంటి వారు వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావాలు వేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు ఎడిషన్ విభాగం సైతం అన్నింటిని తట్టుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రి కేయులు కె. రామచంద్రమూర్తి, జాతీయ సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, వైర్ ఎడిటోరియల్ సభ్యులు కొండూరి వీరయ్య, నెల్లూరి నర్సింహరావు, ఇవి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.