నవతెలంగాణ – హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్, ఒలింపిక్ చాంప్, విక్టర్ అక్సెల్సెన్‌కు షాకిచ్చాడు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకున్నాడు. అయితే, సూపర్ ఫామ్‌లో ఉన్న డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టికి మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. నిన్న రాత్రి హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ డెన్మార్క్ స్టార్ విక్టర్‌పై విజయం సాధించాడు. సెమీస్ చేరుకోవడం ద్వారా అతను కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు. డబుల్స్ లో బంగారు పతకం తెస్తారని ఆశించిన రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ నిరాశ పరిచింది. క్వార్టర్స్‌లో ఈ ద్వయం 18–21, 19–21తో 11వ సీడ్ కిమ్ అస్ట్రుప్–ఆండ్రెస్ స్కారుప్ (డెన్మార్క్) జోడీ చేతిలో పోరాడి ఓడింది.