కట్టు కథలు నమ్మడంలో భారతీయులే – ఫస్ట్‌..!

ఆధునికత పెరుగుతున్న కొద్దీ, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు చేతి గాజుల్ని, కాలి మెట్టెల్ని వదిలేస్తున్నారు. దానివల్ల
హిందూ సంప్రదాయం దెబ్బతింటుందని, పురుషుల ఆధిపత్యం తగ్గిపోతుందని మనువాదుల భయం. అందుకే నాడి గురించి, శక్తి
గురించి బూటకపు విజ్ఞానం ప్రచారం చేస్తున్నారు. ఈ మత పిచ్చి గాళ్ళకు అంత తెలివి ఉంటే… కాలి రెండో వేలి నుండి స్త్రీ
గర్భాశయానికి వెళ్ళే ”నాడి” ఏదో స్పష్టంగా చెప్పాలి. వైద్య శాస్త్రం చదువుకున్న వారికి ‘హ్యూమన్‌ అనాటమీ’ క్షుణ్ణంగా తెలిసి
ఉంటుంది. వారికి ఎవరికీ తెలియని ఒక ‘నాడి’ ఈ మనువాదులకు ఎలా తెలిసిందీ? ఇతర మతాల మహిళలు ఎవరూ మట్టెలు
పెట్టుకోరు. మరి వారంతా బాగున్నారు కదా? హాయిగా కాపురాలు చేసుకుంటూ, పిల్లల్ని కని పోషించుకుంటున్నారు.
ఈ విద్వేషానికి, విధ్వంసాలకు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మారణ హౌమాలకూ కారణం కేవలం అతడొక్కడే! అతడూ, అతని ముఠా అతడి అనుచరులూ కారణం!! అతడి పేరు – దేవుడు. అతని ముఠా పేరు – మతం. అతడి అనుచరులే మత బోధకులూ, భక్తులు!!
ఐదువేల ఏండ్ల క్రితం కృష్ణుడు ఉండేవాడు అని పిట్ట కథలు చెప్పేవారు కాస్త చారిత్రక ఆధారాలేమిటో తెలుసుకుంటే బావుండును. పదకొండో శతాబ్దం వరకు భారతీయ పురాణాలలో ఎక్కడా కృష్ణ శబ్దమే లేదు. వాసుదేవ అనే శబ్దం జాతక కథలలో మాత్రమే ఉంది. ఇరానియన్‌ యాత్రికుడు అల్‌-బరూనీ రాసుకున్న యాత్రా విశేషాలలో కూడా వసుదేవ పేరు ఉందే గాని, కృష్ణ శబ్దం లేదు – ‘జాతక కథలు’ బౌద్ధ సాహిత్యానికి సంబంధించినవి.
తల్లి దండ్రులు లేక తనయుడెట్లు బుట్టు కన్య మేరి క్రీస్తును కన్నదెట్లు
స్త్రీ పురుష కలయికే శిశు జన్మమే కదా కల్పితాలు – కట్టు కథలే సుమీ!
సృష్టి కర్తనంటు యెహౌవా నుండగా శిలువ వేసి చంపె క్రీస్తు నెట్లు
రక్షకుండు తనను రక్షించుకోలేదు లోక రక్షకుడంటె నమ్మడ మెట్లు
సూర్యాస్తమయం అవనిలోనే లేదు అబద్దాల నెట్లు పలికె ఆది గ్రంథం
సృష్టి కర్త స్పృహ లేకపోయెనా
బైబిల్‌ కథలన్ని కట్టు కథలే – అంటూ ఓ ఆధునిక కవి ఎన్నో ప్రశ్నలు గుప్పించాడు. జవాబుల్లేని ప్రశ్నలు అన్ని మతాల మత గ్రంథాల్లోనూ ఉన్నాయి. భక్తులు తమ ఆదాయంలోని దశమ భాగం చర్చ్‌కి ఇవ్వడం మానేస్తే మొట్టమొదట క్రైస్తవాన్ని వదిలేసేవాడు పాస్టరే! అలాగే అల్లా సర్వశక్తి సంపన్నుడు అని చెప్పడానికి ఓ కట్టు కథ చెపుతారు.
”ఓ నా ప్రభూ! నువ్వు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో చూపు” అన్నాడు ఇబ్రహీం.
”ఏం? నీకు నమ్మకం లేదా?” – అన్నాడు అల్లా
”ఉంది. కానీ, నా మనసు తృప్తి పడడానికి అడుగుతున్నాను” – ఇబ్రహీం.
”అయితే, నాలుగు పక్షులను తీస్కో. వాటిని మచ్చిక చేసుకో. తర్వాత వాటిని కోసి వాటి విడి భాగాల్ని కొండమీద పెట్టు. ఆ తర్వాత వాటిని రమ్మని పిలువు. అంతే – అవి ఎగురుకుంటూ వస్తాయి” – అన్నాడు అల్లా ”అందువల్ల అల్లా శక్తిమంతుడు అని తెలుసుకో” అని కూడా చెప్పాడు అల్లా. ఇబ్రహీం మాట్లాడలేదు. వివేకవంతుడైన ఆధునికుడైతే అక్కడ మరో ప్రశ్న అడిగేవాడు. ‘చనిపోయినవే బతికి వచ్చాయని రుజువేమిటీ? ఆ వచ్చేవి కొత్త పక్షులు కావచ్చు కదా?’ – అని! తమ జాతి పక్షి చనిపోతే వెంటనే ఇతర పక్షులు అక్కడికి అరుచుకుంటూ వస్తాయి. ఉదాహరణకు మీరు ఒక పామును కొట్టి చంపండి. దాని జీవద్రవాలు ఉత్ప్రేరకాలుగా పనిచేసి, కాసేపటికి ఆ చోటికి మరో పాము వస్తుంది. ఇది జంతు ప్రవృత్తిలో ఒక భాగం. ఎవరి శక్తియుక్తులూ అక్కర లేదు. అన్ని మత గ్రంథాలలో అభూత కల్పనలు కోకొల్లలు. అవన్నీ నిజమే అని ఇంకా ఈ ఆధునిక కాలంలో కూడా గుడ్డిగా నమ్ముతున్న వారి సంఖ్యే అధికం. ఇతర దేశాల వారి కన్నా కట్టు కథలు నమ్మడంలో భారతీయులదే మొదటి స్థానం.
ఉదాహరణకు…
హిందూ మత గ్రంథాల్లోని కుమారస్వామి జననం గూర్చి చూద్దాం! అక్కడ ఒక సన్నివేశం ఏమిటంటే… అగ్ని దేవుడు శివుణ్ణి చూడడానికి వచ్చాడు. అదెప్పుడూ? శివ పార్వతులు కామక్రీడలో ఉన్నప్పుడు – చెప్పాపెట్టకుండా అలా అకస్మాత్తుగా వచ్చినందుకు శివుడికి కోపం వచ్చింది. అగ్నిపై తన వీర్యాన్ని చల్లుతాడు. ఆ వీర్యం మంటకు అగ్ని తాళలేకపోతాడు. బ్రహ్మను తలుచుకుంటాడు. బ్రహ్మ శరవణ సరసికి వెళ్ళమని సలహా ఇస్తాడు. అగ్ని అక్కడికి పరుగుతీస్తాడు. తీరా అక్కడేం జరుగుతోంది? సప్త రుషుల భార్యలు జలకాలాడుతున్నారు. ఇక నేం అగ్ని తన మంటలు మరిచిపోయి కామోద్రిక్తుడవుతాడు. అనూహ్యంగా అక్కడికి వచ్చిన అగ్నిని చూసి, అరుంధతి తక్షణమే బట్టలు చుట్టుకుంటుంది. మిగిలిన ఆరుగురు ఆ పని చేయరు. పైగా, అగ్నితో కలిసి తృప్తి పొందుతారు. ఆ సమయంలో అగ్ని ఒంటిపై ఉన్న శివుని వీర్యం – ఆ ఆరుగురు రుషి భార్యల గర్భాల్లోకి ప్రవేశిస్తుంది. స్పృహలోకి వచ్చిన ఆ ఆరుగురు మహిళలు భయంతో తమ తమ గర్భ పిండాలను శరవణ సరసిలో తామరాకులపై వదులుతారు. ఎవరి ఇళ్ళకు వారు తిరుగు ముఖం కడతారు. వారి భర్తలు మహారుషులు కదా? తమ భార్యలు ఏ పనిచేసి వస్తున్నారో మంత్రశక్తి వల్ల పసిగడతారు. కోపోద్రిక్తులై వారిని తిరస్కరిస్తారు. ఎంతైనా రుషి పత్నులు శివుని వీర్యాన్ని మోసారు కదా అని బ్రహ్మ కరుణించి, మళ్ళీ మధ్యలో కల్పించుకుని వారికి వరం ఇస్తాడు. జ్యోతిర్లోకంలో వారిని కృత్తికలుగా ప్రకాశించమని దీవిస్తాడు. అప్పుడు శరవణ సరసిలో ఆరుగురు రుషుల భార్యలు తామరాకుల మీద వదిలేసిన పిండాలు అతుక్కుని ఒక్కటై, షణ్ముఖ రూపాన్ని దాలుస్తాయి. ఆ షణ్ముఖ (ఆరు ముఖాల) రూపమే కుమారస్వామి అవుతాడు.
ఈ చిన్న కథలోని విషయాల గూర్చి ఆలోచిస్తే మనకు ఏమనిపిస్తుంది? హిందూ పురాణాల నిండా అక్రమ లైంగిక సంబంధాలు బాహాటంగా కనిపిస్తాయని తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రార్థనా స్థలాలలో కనిపించని స్త్రీ పురుష లైంగిక భంగిమల శిల్పాలు హిందూ దేవాలయాల్లోనే కనిపిస్తాయి. పురాణాలన్నీ వందల ఏండ్ల క్రితం రాయబడ్డవి. శిల్పాలు కూడా ఆ కాలంలోనే చెక్కబడ్డాయి. అప్పటి సమాజ స్థితి గతులను బట్టి అవి ఉనికిలోకి వచ్చాయి. మనం ఈ అత్యాధునిక యుగంలో ఉండి వాటిని తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, అవి గొప్పవని, అవే మన సంస్కృతీ సంప్రదాయాలని వాటిని పాటిస్తూ ఉండాలని చెప్పే అవివేకులకు కొన్ని విషయాలు స్పష్టం చేయక తప్పదు – ఈ కుమారస్వామి జననంలో ఎక్కడైనా, ఏ మాత్రమైనా వాస్తవం ఉందా? అన్నింటికి అన్నీ అభూత కల్పనలే కదా? అగే మండుతూ ఉండేది. అలాంటి అగ్నిని శివుడి వీర్యం మండించిందట. అంటే అది ఇంకా ఎంత వేడిగా ఉండాలి? ఒళ్ళుకాలి గగ్గోలు పెడుతూ శరవణ సరసి పారిపోయిన అగ్ని అక్కడ ఆరుగురు మునిపత్నులను ఎలా మోహించాడు. ఒకేసారి ఆరుగురిని ఎలా సంతృప్తి పరిచాడు? సరే ఆ విషయం అలా ఉండనిద్దాం… మునిపత్నుల గర్భాల్లో అగ్ని దేవుని వీర్యం ఉండాలి గానీ, అతడి ఒంటిమీద పడిన శివుని వీర్యం ఎలా ప్రవేశించిందీ? పోనీ అది కూడా అలా ఉండనిద్దాం… ఉన్న ఫళాన ఆరుగురి గర్భాల్లో ఆరు పిండాలు ఎలా ఏర్పడ్డాయీ? సరే… గర్భాల్ని బయటికి తీసి తామరాకుల మీద వేయగలిగే సామర్థ్యం వారికి ఎలా వచ్చింది? సరే… అది అలా ఉండనిద్దాం. వేరు వేరు ఆకుల మీద ఉన్న పిండాలు ఏ శక్తి వల్ల దగ్గరయ్యాయి? దగ్గరై ఒక్కటయ్యాయి? ఒక్కటై ఎలా షణ్ముఖుడు ఏర్పడ్డాడూ? ఎక్కడికక్కడ ఇంత మంత్రశక్తా? ఇన్ని మహిమలా? ఇన్నిన్ని అభూత కల్పనలా? కాక్‌ అండ్‌ బుల్‌ స్టోరీస్‌ కంటే అధ్వాన్నంగా, అసందర్భ ప్రేలాపనల్లా, వదరుబోతు మాటల్లా సాగే వీటిని… భక్తి శ్రద్ధలతో విని తరించాలా? కనీస ఇంగితం లేని ఈ కట్టు కథలు గొప్ప పురాణాలా? గొప్ప సంప్రదాయ రచనలా? ఆ దేవ దేవుడే స్వయంగా మానవులకు అందించిన మహత్తర జ్ఞాన సాగరాలా? వివేచన పెరిగిన ఆధునికులు వీటిని ఆమోదించాలా? మెదడు లేని జడ పదార్థాలు ఆమోదించాల్సిందే? ‘కల్పిత గాథలు’ అని చెప్పండి చాలు. ఆమోదించడానికి ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. వందల సంవత్సరాలుగా కోట్ల మంది జీవితాల్ని అన్యాయంగా దుర్భరం చేసిన వైదిక మత ప్రభోదకులు అందుకు ఒప్పుకోరు కదా?
నిత్య జీవితంలో మనం చూస్తున్న మరొక విషయం గమనించండి. మూఢ విశ్వాసానికి సైన్సును జోడించి అబద్దపు ప్రచారాలు చేస్తున్న వారిని చూస్తే జాలీ, కోపం రెండూ కలుగుతాయి. అయితే అలాంటి విషయాల గూర్చి సరైన వివరణలు ఇచ్చి జనాన్ని ఆలోచింపజేయాలి. హిందువుల్లో వివాహిత స్త్రీలు కాళ్ళకు ‘మట్టెలు’ పెట్టుకుంటారు. వివాహ సమయంలో పెళ్ళికొడుకు మొదటిసారి పెళ్ళికూతురి కాలి రెండో వేలికి తొడుగుతాడు. ఇప్పుడు దాని వెనక గొప్ప ఆరోగ్య సూత్రముందని మనువాదులు ప్రచారం చేస్తున్నారు. మట్టెలు ధరించే కాలి రెండో వేలు నుండి ఒక నాడి వారి గర్భాశయానికి వెళుతుందని, దాని వల్ల రుతుక్రమం సరిగా ఉంటుందని, గర్భాశయానికి రక్తస్రవరణ బాగా జరుగుతుందని ఢంకా బజాయించి చెపుతున్నారు. వెండి మంచి వాహకం గనుక, భూమి నుండి శక్తిని గ్రహించి దాన్ని శరీరానికి అందిస్తుందని కూడా చెపుతున్నారు. సారాంశం ఏమిటంటే, గతంలో స్త్రీలను బానిసలుగా చూశారు. కాళ్ళకు, నడుముకు, మెడకు అన్ని శరీర భాగాలకు గొలుసులు వేసి, ఒక బానిసలాగా అదుపులో ఉంచుకున్నారు. కాలక్రమంలో వాడే లోహాలు మారాయి. ఇనుము, వెండి, బంగారమైంది. ఒకప్పటి బానిసత్వపు గొలుసులే ఆభరణాలయ్యాయి. హిందూ స్త్రీలు ఆభరణాలు తగిలించుకునే పద్ధతి ఎలా మొదలయ్యిందో నేటి మహిళలకు తెలియదు. డబ్బున్నవాళ్ళయితే ఆభరణాల్ని ఆడంబరంగా కూడా ప్రదర్శించుకుంటారు. స్త్రీలను హద్దులో అదుపులో ఉంచుకోవడానికి ఇవన్నీ ఉండాల్సిందేనన్నది మనువాదుల కుట్ర. అందుకోసం లేని సైన్సును తెచ్చి – తమ ఖాళీ మెదళ్ళను ప్రదర్శించుకుంటున్నారు.
ఆధునికత పెరుగుతున్న కొద్దీ, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు చేతి గాజుల్ని, కాలి మెట్టెల్ని వదిలేస్తున్నారు. దానివల్ల హిందూ సంప్రదాయం దెబ్బతింటుందని, పురుషుల ఆధిపత్యం తగ్గిపోతుందని మనువాదుల భయం. అందుకే నాడి గురించి, శక్తి గురించి బూటకపు విజ్ఞానం ప్రచారం చేస్తున్నారు. ఈ మత పిచ్చి గాళ్ళకు అంత తెలివి ఉంటే… కాలి రెండో వేలి నుండి స్త్రీ గర్భాశయానికి వెళ్ళే ”నాడి” ఏదో స్పష్టంగా చెప్పాలి. వైద్య శాస్త్రం చదువుకున్న వారికి ‘హ్యూమన్‌ అనాటమీ’ క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. వారికి ఎవరికీ తెలియని ఒక ‘నాడి’ ఈ మనువాదులకు ఎలా తెలిసిందీ? ఇతర మతాల మహిళలు ఎవరూ మట్టెలు పెట్టుకోరు. మరి వారంతా బాగున్నారు కదా? హాయిగా కాపురాలు చేసుకుంటూ, పిల్లల్ని కని పోషించుకుంటున్నారు. ఆ మహిళలకు లేని మహాద్భుతమైన ఆరోగ్యం, సుఖ సంతోషాలు ఈ హిందూ మహిళలకు యేం లభిస్తోందనీ? తాళి బొట్టు, గాజులు, మట్టెలు వదిలేసి, పైటలు తగిలేసి స్వేచ్ఛగా తిరుగుతున్న స్త్రీ వాదుల జీవితాలు సజావుగానే ఉన్నాయి. ఏదేమైనా అబద్దపు సైన్సు చెప్పి భయపెట్టడం దండగ. కాలంతో పాటు మార్పులు సహజం. ఫ్యూడల్‌ వ్యవస్థ ఇంకా కొనసాగాలని కొందరు తాపత్రయ పడుతుంటారు. వారి కోరిక నెరవేరదు. మనువాదుల అబద్దాల సైన్సును విశ్లేషించుకునే తెలివితేటలు ఇప్పుడు సామాన్య పౌరులకు కూడా ఉన్నాయి!
కేంద్రంలో బీజేపీ, ఆరెస్సెస్‌ అధికారం చేపట్టాక, దేశం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. మత ప్రాదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయిన దేశాల్లో భారత్‌దే ఇప్పుడు అగ్రస్థానం. సిరియా 7.4, అఫ్ఘనిస్తాన్‌ 8 అయితే భారత్‌ 9.4గా ఉంది. తక్కువ స్కోరు ఉంటే ఆ దేశంలో సుహృద్భావ వాతావరణం ఉన్నట్టు. స్కోరు పెరిగిన కొద్దీ సామాజిక శత్రుత్వాలు పెరిగినట్టు లెక్క. 10లో భారత్‌ – 9.4 స్థానంలో ఉంది. ఈజిప్టు 7.4, పాకిస్థాన్‌ – సోమాలయా 7.6, మాలి 7.9, ఇజ్రయిల్‌ 8, నైజీరియా 8.5ల కంటే భారతదేశంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది. భారత పౌరులు ఈ విషయం గ్రహించి, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది.
– వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ
అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

Spread the love