ఆ చర్యలపై భారత్‌ దృష్టిపెట్టింది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

నవతెలంగాణ ఢిల్లీ: సరిహద్దుల వద్ద కేవలం బలగాల ఉపసంహరణకే పరిమితం కాకుండా.. మరింత పురోగతి సాధించాలని భారత్‌ కోరుకుంటోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. దీనికి కొంత సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో నిర్వహించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి కార్యక్రమంలో రిమోట్‌ విధానంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌-చైనా సరిహద్దుల్లో కొన్నిచోట్ల వివాదాల పరిష్కారానికి దౌత్య, సైనిక అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఫలితంగా పరస్పర భద్రతపై ఓ సమగ్ర అవగాహన వచ్చింది. సరిహద్దుల్లో బలగాలను వెనక్కి పిలిపించే కార్యక్రమం దాదాపు పూర్తయింది. ఇక వీటి తర్వాత ఏం చేయాలన్న దానిపై ఇప్పుడు దృష్టిసారించాము. మేము మరికొంత కాలం వేచిఉండాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి వాస్తవానికి తవాంగ్‌కు ప్రయాణించాల్సి ఉన్నా.. అక్కడ వాతావరణ పరిస్థితి అనుకూలించక అస్సాంలోనే ఆగిపోయారు. అక్కడి ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి తవాంగ్‌లో ఏర్పాటుచేసిన పటేల్‌ విగ్రహం, మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా 560 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి పటేల్‌ కృషిని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇక తవాంగ్‌ను భారత్‌లో విలీనం చేయడానికి కృషి చేసిన మేజర్‌ బాబ్‌ ఖాతింగ్‌ సేవలను రక్షణ మంత్రి కొనియాడారు. ఈశాన్య ప్రాంతంలో అవసరమైన రక్షణ విధానాల తయారీలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. సశస్త్ర సీమాబల్‌, నాగాలాండ్‌ ఆర్మ్‌డు పోలీస్‌ ఏర్పాట్లలో ఆయన కృషిని అభినందించారు.

Spread the love