– 2022-23లో 7.2 శాతంగా నమోదు
– తయారీ రంగం డీలా
– మందగించిన గనుల రంగం
న్యూఢిల్లీ : ఏడాదికేడాదితో పోల్చితే భారత వృద్థి రేటులో తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022 -23లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.2 శాతంగా నమోద య్యిందని జాతీయ గణంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) బుధవారం వెల్ల డించింది. ఇంతక్రితం 2021 -22లో 9.1 శాతం వృద్థి చోటు చేసుకుంది. 2022-23లో మార్చితో ముగిసిన తుది త్రైమాసికం (క్యూ4)లో 6.1 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో 4.4 శాతంగా, క్యూ2లో 6.3 శాతంగా, క్యూ1లో 13.2 శాతంగా నమోదయ్యింది. 2011-12 స్థిర ధరల ప్రకారం.. 2022-23లో వాస్తవ జిడిపి రూ.160.06 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. 2021-22లో ఇది రూ.149.26 లక్షల కోట్లుగా ఉంది. 2022-23లో తయారీ రంగం స్థూల ఉత్పత్తుల విలువ పెరుగుదల 1.3 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఈ రంగం ఏకంగా 11.1 శాతం వృద్థిని కనబర్చింది. ప్రజల కొనుగోలు శక్తికి కోలమానం అయినా తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చడం ఆర్థిక వ్యవస్థలోని బలహీనతల కు నిదర్శనం. ఇదే సమయంలో వ్యవసాయ రంగం పెరుగుదల 3.5 శాతంగా చోటు చేసుకోగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 4 శాతం పెరి గింది. గనుల రంగం కూడా మందగించింది. ఈ రంగం 2022-23లో 4.6 శాతం మాత్రమే పెరిగింది. ఇంతక్రితం ఏడాది 7.1 శాతం వృద్థిని కన బర్చింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర సర్వీసులు 9 శాతం పెరిగి నప్పటికీ.. ఇవి 2021-22లో ఏకంగా 9.9 శాతం వృద్థిని సాధించాయి. నిర్మాణ రంగం 10 శాతానికి మందగించింది. ఈ రంగం 2021-22లో ఏకంగా 14.8 శాతం పెరిగింది. 2022-23లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సర్వీస్ రంగాలు 7.2 శాతం పెరగ్గా.. 2021 -22లో 9.7 శాతం వృద్థిని నమోదు చేశాయి. 2021-22లో రూ. 15,75, 281 కోట్లుగా ఉన్న ప్రభుత్వ వ్యయం.. 2022-23లో రూ.15,77,306 కోట్లకు చేరింది. ప్రయివేటు వినిమయం రూ.87,03,541 కోట్ల నుంచి రూ.93,58,694 కోట్లకు పెరిగింది. గడిచిన మార్చి త్రైమాసికంలో తయారీ రంగం 4.5 శాతం, నిర్మాణ రంగం 10.4 శాతం, వ్యవసాయం 5.5 శాతం, సర్వీసు సెక్టార్ 6.9 శాతం చొప్పున పెరిగాయి. క్రితం క్యూ4లో జిడిపి రూ.43.62 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.41.12 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోల్చితే క్రితం క్యూ4లో 6.1 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.