రెండో వన్డే.. భారత్‌ లక్ష్యం 241

నవతెలంగాణ-హైదరాబాద్ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య నేడు రెండో వన్డే జరుగుతోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే పాథుమ్‌ నిశాంక.. వికెట్‌ కీపర్‌ కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అవిష్క ఫెర్నాండో (40; 62 బంతుల్లో 5 ఫోర్లు), కుశాల్ మెండిస్ (30; 42 బంతుల్లో 3 ఫోర్లు) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరినీ వాషింగ్టన్ సుందర్‌ తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. అవిష్క రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వగా.. కుశాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో సదీర సమరవిక్రమ (14) కోహ్లీకి చిక్కాడు. జనిత్ (12) కుల్‌దీప్‌ యాదవ్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. సుందర్‌ తర్వాతి ఓవర్‌లోనే చరిత్ అసలంక (25)ని వెనక్కి పంపాడు. చివర్లో దునిత్ వెల్లలాగె (39; 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), కమిందు మెండిస్ (40; 44 బంతుల్లో 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.అర్ధ శతకం దిశగా సాగుతున్న దునిత్‌ను కుల్‌దీప్‌ ఔట్ చేయగా.. చివరి ఓవర్‌లో ఐదో బంతికి శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రో విసిరి కమిందును రనౌట్ చేశాడు. చివరి బంతికి అకీలా ధనంజయ (15) కూడా రనౌట్ (కోహ్లీ) అయ్యాడు.

Spread the love