పాక్‌ గగనతలంలోకి దూసుకెళ్లిన ఇండిగో విమానం..

నవతెలంగాణ – ఢీల్లి: ప్రయాణికులతో అమృత్‌సర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌ గగనతలంలోకి దూసుకెళ్లిపోయింది. దాదాపు 30 నిమిషాలపాటు పాక్‌ ఎయిర్‌స్పేస్‌లోనే ప్రయాణించి లాహోర్‌కు సమీపంలో ఉన్న గుర్జన్‌వాలా వరకు వెళ్లిపోయింది. ఈ ఘటన శనివారం రాత్రి 7.30 సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. చివరికి రాత్రి 8.01 గంటలకు తిరిగి భారత్‌కు చేరినట్లు సమాచారం. పాకిస్థాన్‌ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఇండిగో విమానం లాహోర్‌కు ఉత్తర దిశ నుంచి 454 నాట్స్‌ వేగంతో పాక్‌ గగనతలంలోకి ప్రవేశించింది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇలా వెళ్లడం తప్పేంకాదని, అంతర్జాతీయంగా దీనిని అనుమతిస్తారని అక్కడి మీడియా పేర్కొంది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఇండిగో సంస్థగానీ, భారత ప్రభుత్వంగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Spread the love