నవతెలంగాణ – గోవిందరావుపేట
రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచయతీలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు నియమించాలని సీపీఐ(ఎం) పసర గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం) కార్యాలయంలో పల్లపు రాజు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు హాజరై మాట్లాడారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీల విషయంలో ప్రభుత్వం చెప్పిన విధంగా రాజకీయాలకు అతీతంగా గ్రామపంచాయతీల వారిగా గ్రామసభలు జరిపి, ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు నిర్ణయించి, గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి, అర్హులైన వారందరికీ న్యాయం చేకూర్చే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పసర గ్రామంలో మంచినీటి కొరతతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో ఎర్రగుంట దగ్గర ఉన్న బోరు మోటర్ చెడిపోయి రెండు నెలలు గడుస్తున్నా గ్రామ, మండలాధికారులు పట్టించుకోవడం లేదు. పలుమార్లు గ్రామా అధికారులకు విన్నవించినా స్పందన లేకుండా పోయిందని అన్నారు. గ్రామ మండలాధికారులు వెంటనే స్పందించి బోరు మోటర్ ను రిపేర్ చేసి, గ్రామంలోని ప్రజలకు మంచినీటి సరఫరా చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) గ్రామ కమిటీ సభ్యులు మంచోజు బ్రహ్మచారి, సోమ మల్లారెడ్డి, క్యాతం సూర్యనారాయణ, గొర్ల శ్రీను, సప్పిడి ఆదిరెడ్డి, జిట్టబోయిన రమేష్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పిట్టల అరుణ్, మంచాల కవిత, కందుల రాజేశ్వరి, శ్రీరామోజు, సువర్ణ, జిట్టబోయిన అరవింద్, దేవరాజు, గట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.