– సైనా, ప్రణరు, సేన్ సైతం
– సింగపూర్ ఓపెన్ 2023
సింగపూర్ : భారత స్టార్ షట్లర్, డిఫెండింగ్ చాంపియన్ పి.వి సింధు సింగపూర్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. టాప్ సీడ్, జపాన్ షట్లర్ అకానె యమగూచితో పోరులో 21-18, 19-21, 17-21తో పోరాడి ఓడింది. మూడు గేముల పాటు సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్ నెగ్గి ఆధిక్యంలో నిలిచినా.. తర్వాతి రెండు గేముల్లో జపాన్ అమ్మాయి పైచేయి సాధించింది. సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్ సైతం ఓటమి చెందారు. 13-21, 15-21తో రచనోక్ ఇంటనాన్ (థారులాండ్) చేతిలో సైనా ఓడగా.. 17-21, 9-21తో సుపనిద (థారులాండ్) చేతిలో ఆకర్షి పరాజయం పాలైంది. సింధు, సైనా, ఆకర్షి ఓటమితో మహిళల సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ముందంజ వేశాడు. 21-15, 21-19తో థారులాండ్ షట్లర్‌పై వరుస గేముల్లో గెలుపొందాడు. యువ షట్లర్ లక్ష్యసేన్ మూడు గేముల పోరులో నిరాశపరిచాడు. ఐదో సీడ్ చైనీస్ తైపీ చో తిన్ చెన్ 18-21, 21-17, 21-13తో సేన్‌పై గెలుపొందాడు. హెచ్.ఎస్ ప్రణరు 15-21, 19-21తో కొడారు (జపాన్) ఓటమి చెందగా.. ప్రియాన్షు రజావత్ 21-15, 21-19తో జపాన్ ఆటగాడు కెంటాపై గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.