క్వార్టర్స్‌లో సింధు

– శ్రీకాంత్‌, ప్రణయ్ సైతం
– లక్ష్యసేన్‌ పరాజయం
– మలేషియా మాస్టర్స్‌
కౌలాలంపూర్‌ : భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు మలేషియా మాస్టర్స్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో సింధు మెరువగా.. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌ సైతం క్వార్టర్స్‌లో కాలుమోపారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌ పోరులో జపాన్‌ షట్లర్‌ అయా ఒహోరిపై వరుస గేముల్లో సింధు గెలుపొందింది. 21-16, 21-11తో ఎదురులేని విజయం నమోదు చేసింది. హెచ్‌.ఎస్‌ ప్రణయ్ మూడు గేముల మ్యాచ్‌లో పైచేయి సాధించింది. చైనా షట్లర్‌ లి షి ఫెంగ్‌పై 13-21, 21-16, 21-11తో మెరుపు విజయం నమోదు చేశాడు. తొలి గేమ్‌ కోల్పోయిన ప్రణయ్.. చివరి రెండు గేముల్లో రెచ్చిపోయాడు. థారులాండ్‌ షట్లర్‌ కున్లావిట్‌పై కిదాంబి శ్రీకాంత్‌ మెరిశాడు. ఎనిమిదో సీడ్‌ ఆటగాడిపై 21-19, 21-19తో వరుస గేముల్లోనే విజయం సాధించాడు. ఇక యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ నిరాశపరిచాడు. హాంగ్‌కాంగ్‌ షట్లర్‌ కా లాంగ్‌ ఆంగాస్‌ చేతిలో 15-21, 19-21తో వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు.