ప్రేమా.. వ్యామోహం…

ప్రేమ ఓ స్వచ్ఛమైన అనుభూతి. మనం ప్రేమను నిర్వచించలేం. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. చాలా వరకు ప్రేమలో పడితే వారిని గుడ్డిగా నమ్మేస్తాం. వారి గురించి ఎవరైనా చెడుగా చెప్పినా నమ్మలేం. ప్రేమ కోసం పోరాడతాం. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. వారు లేకుండా జీవితాన్ని ఊహించలేం. మన సొంత జీవితాన్ని మరిచిపోయి ఎప్పుడూ వారి కోసమే ఆలోచిస్తాం. వారి పట్ల శ్రద్ధ వహిస్తారు. అయితే నేటి యువత ప్రేమ విషయంలో చాలా గందరగోళంగా ఉన్నారు. ప్రేమంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. సాధన అలాంటి సమస్యతోనే ఈ వారం ఐద్వా అదాలత్‌కు వచ్చింది. తనది ప్రేమో, వ్యామోహమో తేడా తెలియక ఎన్ని ఇబ్బందులు పడిందో తెలుసుకుందాం.
ఎవరితో ఫోన్‌ మాట్లాడనిచ్చేవాడు కాదు. సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అంటే ‘నా గురించి నీకు మొత్తం తెలుసు. అయినా నన్ను పెండ్లి చేసుకున్నాడు.మా అమ్మ నన్ను భరించలేక వదిలేసింది. నీ కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు అనుభవించు. నేను ఇలాగే చేస్తాను. ఇంతకు ముందు ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇలానే చేశాను. అందుకే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో’ అని ఇంట్లో నుండి నెట్టేశాడు.
సాధన డిగ్రీ చివరి ఏడాదిలో ఉంది. వాళ్ళది కో ఎడ్యుకేషన్‌ కాలేజీ. సాధన స్నేహితుల్లో అబ్బాయిలు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలూ, అబ్బాయిలు స్నేహంగా ఉండడం కామన్‌. అందుకే తమ కూతురు అబ్బాయితో మాట్లాడినా, స్నేహితులు ఇంటికి వచ్చినా అడ్డు చెప్పే వారు కాదు. వాళ్ళకు కూతురిపై అంత నమ్మకం. వాళ్ళకు చిన్న టీ షాప్‌ ఉంది. కాలేజీకి సెలవు వచ్చినప్పుడల్లా సాధన కూడా ఆ టీ షాప్‌కి వెళ్ళి కూర్చొనేది. తనకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేవు. కాకపోతే సాధన తండ్రి మద్యం తాగేవాడు. ఎంతమంది చెప్పినా వినడు. ప్రతి రోజు ఎంతో కొంత తాగి పడుకునేవాడు. అయితే పండుగలకు, బంధువులు ఇంటికి వెళ్ళినపుడు ఎక్కువగా తాగుతాడు. అప్పుడు భార్యాభర్త ఇద్దరూ బాగా గొడవపడేవారు. ఇది ఓ సమస్యగా ఉండేది సాధనకు.
కాలేజీకి వెళ్ళొచ్చి ఇంట్లో ఎవరితో మాట్లాడేది కాదు. ఫోన్‌ చూసుకుంటూ కూర్చునేది. అప్పటికి కరోనా ప్రభావం ఇంకా పోలేదు. కరోనా వచ్చిన తర్వాత చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అందరూ ఫోన్‌కి అలవాటయ్యారు. అలానే అనుకుంది సాధన తల్లి కూడా. కానీ తండ్రి అలా కాదు, ఆమె ఫోన్‌లో ఎందుకు అంత టైం గడుపుతుందనే అనుమానం వచ్చింది. అప్పటి నుంచి కూతురిని గమనించడం మొదలుపెట్టాడు. సాధనకు తండ్రి అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ. అలాంటిది ఆ మధ్య కాలంలో తండ్రితో కూడా మాట్లాడటం మానేసింది. ప్రతి విషయానికి చిరాకు పడేది. అందుకే తండ్రికి అనుమానం వచ్చింది.
ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఫోన్‌ మాట్లాడేది. బయట నుండి తలుపుకు గడియ పెట్టి వెళ్ళేది. రెండు, మూడు గంటల తర్వాత తిరిగి వచ్చేది. ఇదంతా తండ్రి గమనించాడు. ఈ విషయమే భార్యకు చెప్పాడు. ఆమె భర్త మాటలు నమ్మకుండా కూతురికే సపోర్ట్‌ చేసింది. కొంత కాలానికి ఇంట్లో డబ్బులు కనిపించకుండా పోయేవి. అప్పుడప్పుడు బంగారం కూడా కనిపించేది కాదు. టీ షాప్‌లో డబ్బులు కూడా మాయం అవుతుండేవి. ఇంట్లో ఉండేది నలుగురు మాత్రమే. ఏ వస్తువు ఎక్కడ ఉండేది తెలిసేది కూడా ఆ నలుగురికే. అబ్బాయి చిన్నవాడు. భర్త తీసుకోడు. తీసుకున్నా చెప్పి తీసుకుంటాడు. ఇక మిగిలింది సాధన. తల్లి ఆమెను అడిగింది. కోపగించుకుంది. అప్పటి నుంచి సాధన తల్లిదండ్రులపై కోపం పెంచుకుంది.
ఇంట్లో వారితో మాట్లాడటమే మానేసింది. అందరినీ శత్రువుల్లా చూస్తుంది. ఒకసారి వాళ్ళ అమ్మ ఫోన్‌లో బ్యాలెన్స్‌ అయిపోయేది. దాంతో భర్తకు ఫోన్‌ చేయడానికి సాధన ఫోన్‌ తీసుకుంది. అప్పుడు సాధన ఆమెతో పెద్ద గొడవ చేసి తల్లిపైనే చేయి చేసుకుంది. అయినా చిన్న పిల్ల కదా అని ఆ తల్లి ఊరుకుంది. ఆ విషయం మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నుంచి 20 గ్రాముల బంగారం పోయింది. ఆ విషయంపై భార్యాభర్తలు గొడవ పడ్డారు. అదే అవకాశంగా తీసుకుంది సాధన.
అందరూ పడుకున్న తర్వాత ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. తెల్లారి చూస్తే కూతురు ఇంట్లో లేదు. మొత్తం వెతికారు. పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశారు. సాధనకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. కొద్దిసేపటికి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. కూతురు ఎటువెళ్ళిందో తెలియదు. ఏమైందో తెలియదు. సర్వం కోల్పోయిన మనుషులుగా మిగిలిపోయారు ఆ తల్లిదండ్రులు. 11:00 గంటల సమయంలో ఫోన్‌ మోగింది. ఎత్తి మాట్లాడితే ‘డాడీ నేను దిలీప్‌ను పెండ్లి చేసుకుంటున్నాను’ అంది. తండ్రి గుండె బద్దలయింది.
ఎలాగో తేరుకొని ‘నీవు ఇంటికి రా, అందరితో మాట్లాడి నేను నీ పెండ్లి చేస్తాను’ అని చెప్పాడు. కానీ సాధన వినలేదు. ‘నేను ఇంటికి వస్తే మీరు నాకు వేరే వ్యక్తితో పెండ్లి చేస్తారు’ అని ఫోన్‌ పెట్టేసింది. గుడిలో దిలీప్‌ను పెండ్లి చేసుకుని వచ్చింది. దిలీప్‌కు తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. వాళ్ళ అక్క కూడా ప్రేమ వివాహం చేసుకుంది. దిలీప్‌ ఓ జులారు. ఏ పనీ చేయడు. తల్లి సంపాదించిన డబ్బులతో జల్సా చేస్తాడు. అతనికి లేని అలవాటు అంటూ లేదు. మద్యం తాగడం, గుట్కా తినడం.. ఇలా చెడు అలవాట్లు అన్నా ఉన్నాయి. వాటికి తోడు ఇంతకు ముందు ఇద్దరు అమ్మాయిలను పెండ్లి చేసుకుని కొన్ని రోజులు గడిపి వదిలేశాడు. పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై రెండు కేసుకు ఉన్నాయి. జైలుకు వెళ్ళి రెండేండ్లు గడిపి వచ్చాడు. అలాంటి అబ్బాయిని సాధన ఇప్పుడు పెండ్లి చేసుకొని వచ్చింది.
సాధన తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళారు. పోలీసులు దిలీప్‌్‌ తల్లిని పిలిస్తే ‘మీ ఇష్టం మీకు నచ్చినట్లుగా చేసుకోండి. వాడిపైన కేసైనా పెట్టండి. లేకపోతే వాళ్ళిద్దరికీ పెండ్లి చేయండి. మీరేం చేసినా నాకు సంబంధం లేదు. నేను ఇంక వాడిని భరించలేను’ అంటూ పోలీసులకు చెప్పి వెళ్ళిపోయింది. సాధనకు నచ్చజెప్పడానికి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా ప్రయత్నించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ‘నేను దిలీప్‌తోనే వుంటాను’ అంటూ మొండికేసింది. అందరి సమక్షంలో పెండ్లి చేస్తామన్నా వినలేదు.
దిలీప్‌పై అదే పోలీస్‌ స్టేషన్‌లో కేసులు ఉన్నాయి. ‘సాధనకు ఇప్పుడు 18 ఏండ్లు నిండాయి కాబట్టి మేము ఏం చేయలేము. మేము ఆమెను మీతో బలవంతంగా పంపించలేము. ఆమె మీతో వస్తాను అంటే తీసుకువెళ్ళండి. అంతేకానీ మేము మాత్రం ఏం చేయలేము’ అంటూ పోలీసులు చేతులు దులుపుకున్నారు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. సాధన దిలీప్‌తో వెళ్ళిపోయింది. ఇక చేసేది ఏమీలేక వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళారు. దిలీప్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఏ ఒక్కరూ దిలీప్‌ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు. చివరికి అతని స్నేహితులను పిలిచి మాట్లాడినా ఎలాంటి ఉపయోగం లేదు.
‘మేము పెండ్లి చేసుకుని వచ్చాం. మీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ వల్ల నా భర్తకు ప్రాణహాని ఉంది. మా దగ్గరకు మీరు రావద్దు. మీ దగ్గరకు నేను రాను’ అని సాధన పోలీస్‌ స్టేషన్‌లో రాసి ఇచ్చింది. ‘ఎంత చెప్పినా ఇంకా ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు. ఇలాగే ఇబ్బంది పెడితే చనిపోతాను’ అని బెదిరించింది. తల్లిదండ్రులు ఏం చేయలేక వదిలేశారు. దిలీప్‌ సాధనతో ఓ నెల వరకు బాగానే ఉన్నాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బులు, బంగారం మొత్తం అయిపోయింది. ఇక అప్పటి నుండి ‘నీవు ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు సంపాదించి ఇవ్వు. నీవు చదువుకున్నావు కాబట్టి మంచి ఉద్యోగం వస్తుంది. నాకు ఎలాంటి చదువు లేదు’ అంటూ మూడు నెలల్లో సాధనకు నరకం చూపించాడు.
ఎవరితో ఫోన్‌ మాట్లాడనిచ్చేవాడు కాదు. సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అంటే ‘నా గురించి నీకు మొత్తం తెలుసు. అయినా నన్ను పెండ్లి చేసుకున్నాడు. మా అమ్మ నన్ను భరించలేక వదిలేసింది. నీ కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు అనుభవించు. నేను ఇలాగే చేస్తాను. ఇంతకు ముందు ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇలానే చేశాను. అందుకే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో’ అని ఇంట్లో నుండి నెట్టేశాడు. అవమానంతో ఇక్కడ (లీగల్‌ సెల్‌)కు వచ్చింది సాధన.
లీగల్‌ సెల్‌ సభ్యులు సాధన తల్లిదండ్రులను పిలిచి మాట్లాడితే ‘మా కూతురు మాకు బరువు కాదు. కావాలంటే దిలీప్‌ను కూడా మేము ఇంట్లో కూర్చోబెట్టి పోషిస్తాము. ఎంతగా చెప్పినా వినకుండా అతనితో వెళ్ళిపోయింది’ అంటూ వాళ్ళు ఏడ్చేశారు. ‘సాధన నీకు ఇప్పుడు 18 ఏండ్లు మాత్రమే. ముందు జీవితం చాలా ఉంది. నీవు దిలీప్‌ కోసం ఆలోచిస్తూ నీ జీవితం పాడుచేసుకోకు. మీ తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళు. నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకో. అతని వల్ల ఇద్దరమ్మాయిల జీవితం నాశనం అయ్యింది. అతనితో ఉంటే నీ జీవితం కూడా అలాగే అవుతుంది. నువ్వే ఆలోచించుకో. అతనితో వుండి నాశనం చేసుకుంటావో? నీ తల్లిదండ్రులతో వెళ్ళి జీవితాన్ని బాగుచేసుకుంటావో? నిర్ణయం నీదే. అతను ఎంత చెప్పినా వినడు, మారడు. ఇప్పుడైతే మీ ఇంటికి వెళ్ళు, బాగా ఆలోచించుకొని రా’ అని చెప్పి పంపించారు.
ఆరు నెలల తర్వాత సాధన తిరిగి వచ్చింది. ‘మేడమ్‌ నేను డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఉద్యోగం చేసుకుంటూ పీజీ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఆ రోజున నన్ను నా తల్లిదండ్రుల దగ్గరకు పంపించకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. దిలీప్‌ లాంటి వాడి కోసం నాలాంటి అమ్మాయిలు తమ జీవితాలు ఎలా నాశనం చేసుకుంటున్నారో ఈ ప్రపంచానికి తెలియాలి. వాళ్ళు కూడా నాలాగే మారి వారి జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. అదే నా కోరిక’ అని చెప్పి వెళ్ళిపోయింది.
– వరలక్ష్మి, 9948794051

Spread the love