– కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని తల్లిపై దాడి
– కరెంటు స్తంభానికి కట్టేసి చిత్రవధ
– దాడికి పాల్పడిన పదిమందిపై కేసు నమోదు
కర్నూలు : కర్నూలులో అమానుషం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. కుమారుడు కులాంతర వివాహం చేసుకున్న నేరానికి యువతి తరపున వారు అమానుషంగా ప్రవర్తించారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత ఈరన్న అదే గ్రామానికి చెందిన రజక యువతిని ప్రేమించి ఈ ఏడాది ఫిబ్రవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యువకుడి కుటుంబం గ్రామంలో నివసించడం లేదు. నాలుగు రోజుల క్రితం యువకుడి తల్లి, సోదరుడు గ్రామానికి వచ్చారనే సమాచారం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు గురువారం రాత్రి యువకుడి తల్లిపై దాడి చేశారు. అనంతరం కరెంటు స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి తల్లిని విడిపించారు.
ఆమె ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, నాయకులు పరమేష్, దేవదాసు శ్రీను, అబ్దుల్ శుక్రవారం పరామర్శించారు.
కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా
దాడికి పాల్పడిన వారిని, దాడికి ఉసిగొల్పిన పెత్తందార్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు కెవిపిఎస్, ప్రజాసంఘాలు శుక్రవారం ధర్నా నిర్వహించాయి. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వై నగేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురు శేఖర్, కెవిపిఎస్ నాయకులు డి.విజయమ్మ మాట్లాడారు. అమ్మాయి తల్లిదండ్రులను పెత్తందార్లు రెచ్చగొట్టారని, యువకుడి తల్లిపై దాడి చేయకపోతే మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేస్తామని బెదిరించారని విమర్శించారు. దీంతో పెత్తందారు లతో కలిసి అమ్మాయి బంధువులు దాడి చేసి అనంతరం కరెంటు స్తంభానికి కట్టేశారని తెలిపారు. ఘటనకు కారణమైన పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.