– యువతిపై సామూహిక లైంగికదాడి ..? ఆపై హత్య
– 48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తాం : రాష్ట్ర హోంమంత్రి అనిత
అమరావతి : బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైంది. ఆమె మృతదేహం వివస్త్రగా ఉండడం, ఒంటిపై గాయాలు ఉండడంతో సామూహిక లైంగికదాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యువతి మృతదేహాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. నిందితులను 48 గంటల్లో అరెస్టు చేస్తామని ఆమె చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం… ఈపురుపాలెం గ్రామంలోని చేనేత కుటుంబమైన సీతారాంపేటకు చెందిన పౌజుల వెంకటేశ్వర్లు, కామాక్షి దంపతుల పెద్ద కుమార్తె సుచరిత (21) ఇంటర్ చదివారు. టైలరింగ్ నేర్చుకొని ఇంటి వద్దే దుస్తులు కుడుతున్నారు. శుక్రవారం వేకువజూమున సుమారు 5.30 గంటల సమయంలో ఎప్పటిలాగే బహిర్భూమికి వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. రైలు పట్టాల పక్కన ఈపురుపాలెంలో గర్ల్స్ హైస్కూల్ గోడ పక్కన పొదల్లో సుచరిత మృతదేహం వివస్త్రగా ఉంది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయి. ముక్కు నుంచి రక్తం కారుతోంది. దీనిపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిపై సామూహిక లైంగికదాడి, హత్య జరిగిందని మీడియాలో ప్రచారం జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లాలని వెంటనే హోం మంత్రి అనితను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతోనూ చర్చించి ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. యువతి మృతదేహాన్ని జిల్లా ఎస్‌పీ, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.
యువతి మృతదేహాన్ని పరిశీలించిన హోం మంత్రి
యువతిపై లైంగికదాడి చేసి హత్య చేసిన నిందితులను 48 గంటల్లో పట్టుకుంటామని హోం మంత్రి అనిత చెప్పారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్‌పీి వకుల్ జిందాల్, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యతో కలిసి మంత్రి ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. హత్యకు గురైన యువతి మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. లైంగికదాడా ? సామూహిక లైంగికదాడా? అనేది దర్యాప్తులో తేలనుందని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి చెప్పారు. మంత్రి వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, ఆర్‌డీఓలు తదితరులు ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెక్కు రూపంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అందజేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించండి : డిజిపికి సిఎం చంద్రబాబు ఆదేశం
ఈపూరుపాలెం ఘటనలో దోషులకు కఠిన శిక్షపడేలా పోలీసులు వ్యవహరించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. డిజిపిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల గురించి డిజిపితో సీఎం చర్చించారు. ఈపూరుపాలెంలో జరిగిన ఘటనలు వంటికి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించారు. త్వరలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
కఠిన చర్యలు తీసుకోండి : ఐద్వా
యువతిపై లైంగికదాడి, హత్య ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఐద్వా డిమాండ్ చేసింది. తక్షణం దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ మేరకు ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌పై నియంత్రణ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.