– ఫీల్డింగ్‌లో బొటనవేలికి గాయం
– కొనసాగిన మ్యాచ్ సిములేషన్ ప్రాక్టీస్
భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుండగా.. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్‌లో ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండేది లేనిది అనుమానంగానే ఉండగా.. కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ గాయం బారిన పడ్డారు!. మ్యాచ్ సిములేషన్ సాధనలో స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ బొటన వేలి గాయానికి గురయ్యాడు.
పెర్త్ (ఆస్ట్రేలియా) : భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు నవంబర్ 22న ఆరంభం కానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి పోరులో భారత జట్టు టాప్ ఆర్డర్‌లో ఆటగాళ్ల సేవలను కోల్పోయే ప్రమాదంలో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఇప్పటికీ పెర్త్‌కు చేరుకోలేదు. రోహిత్ శర్మ లేకపోతే ఓపెనర్ బెర్త్ ఖాళీ అవుతుంది. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా పోటీపడుతున్న కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ గాయాల బారిన పడ్డారు. కెఎల్ రాహుల్ ఎల్బో గాయంతో మైదానం నుంచి నిష్క్రమించగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ సైతం రాహుల్ బాటలోనే నడిచాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. గాయంతో విలవిల్లాడిన గిల్ వెంటనే మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ గాయానికి బీసీసీఐ వైద్య బృందం తదుపరి చికిత్స అందించింది. గాయం తీవ్రతపై జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌కు గాయాల నేపథ్యంలో భారత్-ఏతో పాటు ఆస్ట్రేలియాకు వచ్చిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను టెస్టు జట్టుతో చేరాల్సిందిగా బీసీసీఐ నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. అభిమన్యు ఈశ్వరన్ రూపంలో జట్టులో మరో టాప్ ఆర్డర్ బ్యాటర్ అందుబాటులో ఉన్నాడు. అయినప్పటికీ, దేవదత్ పడిక్కల్‌ను సైతం పెర్త్‌లో టెస్టు జట్టుతో చేరాల్సిందిగా కోరారు. పడిక్కల్ టెస్టు జట్టులో భాగంగా ఉంటాడా? రిజర్వ్ ఆటగాడిగా ఉంటాడా అనే అంశంపై స్పష్టత లేదు.