వనరుల కేటాయింపులో అన్యాయం

వనరుల కేటాయింపులో అన్యాయం– దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
– యూపీకే అగ్ర తాంబూలమని పలు రాష్ట్రాల ఫిర్యాదు
న్యూఢిల్లీ : మన దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య ఏమంటే ఫెడరల్‌ వ్యవస్థపై ఒత్తిడులు పెరుగుతున్నాయి. తమకు వనరుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు గత కొంతకాలంగా ఫిర్యాదు చేస్తున్నాయి. పన్నుల ద్వారా కేంద్రం పొందుతున్న రాబడిని రాష్ట్రాలకు కేటాయించే సమయంలో గత 30 సంవత్సరాలుగా దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు చూస్తూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు వనరుల కేటాయింపు రానురానూ తగ్గిపోతోంది. 12వ ఆర్థిక సంఘం దగ్గర నుండి కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు తమ కేటాయింపులను గణనీయంగా కోల్పోతున్నాయి. 14వ, 15వ ఆర్థిక సంఘాల కాలం నుండి ఆయా రాష్ట్రాలు తమ నిరసన ధ్వనులను గట్టిగా వినిపిస్తున్నాయి. ఆర్థిక సంఘాలు జనాభాకు సంబంధించి 2011 లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. దీనిని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉంది. సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. మరోవైపు విధానపరమైన డిమాండ్ల కారణంగా దక్షిణాదిన జనాభా స్థిరంగా ఉంది.
వనరుల కేటాయింపు విషయంలో రాజస్థాన్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల డిమాండ్లు న్యాయ సమ్మతంగానే ఉన్నాయి. ఎందుకంటే అది దక్షిణాది రాష్ట్రాల కంటే చాలా పేదవి. ఆర్థికంగా వెనుకబడినవి. కాబట్టి వాటికి సహజంగానే అధిక సాయం అవసరమవుతుంది. ఆరోగ్యం, విద్య రంగాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో మరిన్ని ఆస్పత్రులు, పాఠశాలలు నిర్మించాల్సిన అవసరం ఉంది. దక్షిణాదిలో ఎవరో కొందరికి తప్ప మిగిలిన వారందరికీ ఈ రాష్ట్రాల పట్ల విముఖత లేదు. ఈ రాష్ట్రాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు తమ సొమ్మును వాడుతున్నారని ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. తమ డబ్బును వేరే ఇతర ప్రయోజనాల కోసం వినియోగించినప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది. ఇక్కడ వనరుల కేటాయింపు సరిగా లేదన్నదే ప్రధాన ఫిర్యాదు. జనాభా రీత్యా ఉత్తరప్రదేశ్‌ అతి పెద్ద రాష్ట్రం. పరిమాణాన్ని బట్టి అధిక వనరులు ఆ రాష్ట్రానికే దక్కుతున్నాయి. ఇది ఇతర రాష్ట్రాలకు అసమంజసంగా ఉంటుంది. వాస్తవానికి దామాషాకు విరుద్ధంగా ఉత్తరప్రదేశ్‌కు వనరుల కేటాయింపు జరుగుతోంది. అనేక అంశాల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌ రాష్ట్రాలతో ఉత్తరప్రదేశ్‌కు పోలికలు ఉన్నాయి. అయినప్పటికీ యూపీకే వనరుల కేటాయింపు అధికంగా జరుగుతోంది. ఆర్థిక పరిమాణం కంటే దాని బడ్జెట్‌ చాలా ఎక్కువ. బీహార్‌ కంటే యూపీ ఆర్థికంగా బలంగా ఉంది. అయినా యూపీకే కేటాయింపులు ఎక్కువ. వనరుల కేటాయింపులో అనుసరించే విధానాలే ఈ వ్యత్యాసాలకు కారణమని నిపుణులు తెలిపారు. రాష్ట్రాలకు కేటాయింపులు జరిపేటప్పుడు జనాభా, విస్తీర్ణం, అడవులు-జీవావరణం, ఆదాయం, పన్నులు-ద్రవ్య ప్రయత్నాలు, జనాభా పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏదేమైనా జనాభా నియంత్రణతోనే సమస్యలు పరిష్కారమవుతాయి.

Spread the love