ఐటీడీఏ లేక గిరిజనులకు అన్యాయం

– పోడు పట్టాల పంపిణీలో జాప్యం వద్దు
– గిరిజనసంఘం నాయకులు భూక్యా వీరభద్రం
– ఐటీడీఏ సాధనకు 4న రౌండ్‌ టేబుల్‌ సమావేశం
నవతెలంగాణ-కారేపల్లి
ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ లేక జిల్లా గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గిరిజన సంఘం నాయకులు గిరిజన సమస్యలపై గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా మాణిక్యారంలో భూక్యా రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం జిల్లా గిరిజనుల అభివద్ధి, సంక్షేమం, విద్యా, ఉపాధికై జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంద న్నారు. గిరిజనాభివృద్ధి కొరకు మైదాన ప్రాంతాల్లో కూడా ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భద్రాచలం కేంద్రం ఐటిడిఏ పనిచేసినది జిల్లా విభజన అనంతరం ఐటీడీఏ లేకపోవడంతో ప్రభుత్వ పధకాలు ఖమ్మం జిల్లా గిరిజ నులకు అందటం లేదన్నారు. ఐటీడీఏ సాధన ఉద్యమంలో గిరిజనులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగులు, యువకులు అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. పోడుకు పట్టాల పంపిణిలో జాప్యం వద్దన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభంఅయిందని, వెంటనే పట్టాల పంపిణీ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దరఖాస్తు చేసుకున్న గ్రామసభలో అమోదం పొందిన ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించా లన్నారు. ఈనెల 4న ఖమ్మం బంజారా భవన్‌లో ఐటీడీఏ ఏర్పాటుకు జిల్లా స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహి స్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు అజ్మీర శోభన్‌బాబు, భూక్య రమేష్‌, మాలోతు రాంకోటి నాయక్‌, భూక్యా నందు నాయక్‌, రామ్మూర్తి, యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love