మనకు తెలిసింది మాత్రమే వాస్తవం కాదు. తెలియని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసే కొద్ది గుండె బేజారు అవుతుంది. పిల్లలపై వేధింపులు ఇంత ఘోరంగా జరుగుతున్నాయా అనిపిస్తుంది జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన లెక్కలు, చేసిన సర్వేలు చూస్తుంటే దాదాపు మొత్తం పిల్లల్లో సగం మంది శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలుస్తోంది. ఇంకా మనకు భవిష్యత్తు ఎక్కడిది? వేధింపులకు గురైన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలు ఏం కావాలి? రోగ పీడితులైన పిల్లలతో ఉన్న సమాజం రోగగ్రస్తం కాదా..?
2007లో కేంద్ర ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక సర్వే నిర్వహించింది. 13 రాష్ట్రాల్లో 1,25,000 మంది పిల్లల్ని పరిశీలించి ఈ సర్వే చేస్తే, అందులో బయటపడ్డ విషయాలు వింటే మనకు నిద్ర పట్టదు. 53 శాతం మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నారని ఆ సర్వే ప్రకారం తెలుస్తోంది. అందులో శారీరక వేధింపులకు నూటికి 66, లైంగిక వేధింపులకు 50, మానసిక వేధింపులకు మరో 50శాతం మంది పిల్లలు గురవుతున్నారు. మొత్తం మీద 53 శాతం మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నారు. అందులో ఆడపిల్లలే కాక 20శాతం మగ పిల్లలు కూడా ఉన్నారు. ఈ సమాజానికి మాయరోగం పట్టినట్టుంది. అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. యూనిసెఫ్ 2005-13 మధ్యకాలంలో నిర్వహించిన ఓ సర్వేలో భారతదేశంలోని ఆడపిల్లల్లో నూటికి నలభై రెండు మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
గళం విప్పుదాం…
పిల్లలపై జరిగే దారుణాలకు రకరకాలు కారణాలు ఉంటున్నాయి. మొదలు లైంగిక వేధింపులు గురించే మాట్లాడదాం. అనేక విషయాలు కుటుంబ పరువు మర్యాదలకు, స్త్రీల లైంగికతకు లేదా శీలం పాతివ్రత్యాలకు ముడిపెట్టి చూడటం మన సమాజంలో బాగా పాతుకు పోయింది. ఇటువంటి కారణాల వల్ల ఎన్ని దారుణాలు జరిగినా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ తెలిసినా నోరు మూసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే మూయిస్తున్నాం. గుట్టు బయట పడకూడదు అన్నట్టుగా వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ధోరణి కూడా పిల్లల మీద సాగే లైంగిక వేధింపులకు ఒక కారణమే. వీటితోపాటు పిల్లల మీద సాగే వేధింపులు అత్యధిక భాగం బాగా తెలిసిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులే కారణమని కూడా అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే ఇటీవల ఓ సినిమా వచ్చింది. అదే లవ్ స్టోరీ. ఇందులో ప్రధాన పాత్రధారులు నాగచైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో సాయి పల్లవి చిన్నాన్న ఆ అమ్మాయి పట్ల వేధింపులకు కారకుడు అవుతాడు. కానీ ఎవరితోనూ చెప్పలేదు, ఎలా తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది. కొండచిలువ అని పేరు పెడుతుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఈ సినిమా చూడొచ్చు. ఏమైనా ధైర్యం చేసి పిల్లల మీద సాగే వేధింపుల అంశాన్ని తన కథనంలో చేర్చిన శేఖర్ కమ్ములకు మనమంతా ధైర్య ధన్యవాదాలు చెప్పాల్సిందే
భౌతిక, మానసికపరమైన వేధింపులు
‘దండం దశ గుణం భవేత్’ అనే శ్లోకాలు మన పంతుళ్లు బాగా ఉచ్చరిస్తారు. అంటే పిల్లలను కొట్టి తిట్టి దారిలోకి తెచ్చుకోవాలని. పిల్లలకు మనసు ఉండదా? వాళ్ళ ఆలోచనలకి మేధాశక్తికి ప్రాధాన్యం ఎందుకు ఇవ్వము. నిజం చెప్పాలంటే తర్వాత తరాల వాళ్లు మనకన్నా ఎక్కువే తెలుసుకుంటున్నారు. మనం కొట్టి తిట్టి దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు వస్తారా? ఒకవేళ వచ్చినా తిరగబడటం తప్ప మరో పరిష్కారం ఏం ఉంటుంది. కొట్టిన వాళ్ళ పట్లనే కాదు సమాజం పట్ల కూడా వాళ్ళు ద్వేషాన్ని పెంచుకుంటారు. దెబ్బ తగిలితే ఒక రోజుకో, రెండు రోజులతో పోతుంది. కానీ దెబ్బల ప్రభావం మనసు మీద పడితే అది అంత తేలిగ్గా పోదు. అది వాళ్ళ జీవితాంతం వెన్నాడుతుంది. దెబ్బకు దెబ్బ తీయాలని ద్వేషపూరితమైన మనస్తత్వం కూడా పెరుగుతుంది. ఇది కూడా ఓ రకంగా పితృస్వామ్య భావజాలం నుంచే వచ్చిందనిపిస్తుంది. తండ్రి చెప్పినట్టు వినాలి, భర్త చెప్పినట్టు వినాలి లేదా పెద్దన్న చెప్పినట్టు అందరూ వినాలి.. ఇలా ఉంటుంది. అంటే ఆధిపత్యం. ఇంట్లో ఒకరే అధిపత్యం చలాయిస్తారు. మిగతా వాళ్ళంతా ఆదిపత్యానికి తలొగ్గి ఉండాలి. ఆధిపత్యం అంటేనే అప్రజాస్వామికమైనది. ఇతరుల ఆలోచనలకు, మాటలకు ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వనిది. కాబట్టి ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎదురు తిరిగిన వాళ్ళకి దొరికే సత్కారం ఏంటంటే అయితే తిట్లు లేకుంటే దెబ్బలు.
జీవితాంతం ఈ బాధ ఉంటుంది
పిల్లల మీద వేధింపుల ప్రభావం వారి జీవితకాలం ఉంటుంది. పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ ప్రభావం మెదడు, నాడీ మండల మీద పనిచేస్తుంది. శారీరక ఆరోగ్యం మీద, మేధో శక్తి మీద ఆ ప్రభావం ఉంటుంది. అయితే నిరంతరం లైంగిక వేధింపులు కావచ్చు, శారీరక మానసిక వేధింపులు కావచ్చు వాటి ప్రభావం రకరకాలుగా ఉంటుంది. పిల్లల మానసిక స్థితి, వారి సామాజిక జీవితం, ఆరోగ్యం, శారీరక ఎదుగుదల, లైంగిక జీవితం వీటన్నిటి మీద వాటి ప్రభావం ఉంటుంది. ఈ వేధింపుల ప్రభావం పిల్లలతోపాటు పిల్లల తల్లిదండ్రులు, దగ్గర బంధువుల మీద కూడా ఉంటుందని ముంబైలోని భాటియా హాస్పిటల్ మానసిక వైద్యులు డాక్టర్ ఫోరం మెటాలియ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రిపోర్ట్‌లో చెప్పారు. పిల్లల మానసిక ఎదుగుదల భావోద్వేగాల మీద ఈ ప్రభావం దారుణంగా ఉంటుంది.
పిల్లల ముందు మాట్లాడం
మనం అనేక విషయాల గురించి పిల్లల ముందు మాట్లాడం. ఇంకా చెప్పాలంటే వాళ్ళని అజ్ఞానంలోనే ఉంచుతాం. స్త్రీ పురుష శరీర భాగాల గురించి, లైంగిక జీవితం గురించి ఏనాడు పిల్లల ముందు మాట్లాడం, చెప్పం. ఒకవేళ వాళ్లు ఏదన్నా తెలిసీ తెలియక ప్రశ్నలు అడిగినా ‘నీకు తెలియదు నోరు మూసుకో, పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం నువ్వు బయటికి వెళ్ళు’ అని కసురుకుంటాం. కానీ అది జీవితంలో ఒక భాగం అనే జ్ఞానం మనకు ఉండట్లేదు. మరి వాస్తవ విషయాలు వాళ్ళకి ఎట్లా అర్థం కావాలి. ఏనాడూ మనం తెలియచెప్పం. అర్థం చేయించే ప్రయత్నం చేయం. శాస్త్రీయంగా మనం ఆలోచించం. పిల్లలకి విషయాలు చెప్పం. ఇది కొన్ని రకాల గందరగోళాలకి దారితీస్తుంది. ఈ గందరగోళం పిల్లల్లో కూడా రకరకాల పైత్యాలకి దారితీస్తుంది.
కాస్త సున్నితంగా ఆలోచిద్దాం
పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన ఏదో తప్పు చేశామని భావన, నేనెందుకూ పనికిరాను అనే ఆలోచనలు, బిడియం వంటివి ఉంటాయి. వీటివల్ల పదిమందిలో కలవలేకపోతారు. అందుకే కాస్త సున్నితంగా ఆలోచిద్దాం. పెద్దవాళ్లకు ఉన్నట్లే పిల్లలకి హక్కులుంటాయి. ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్లకన్నా ఎక్కువే ఉంటాయి, ఉండాలి. పిల్లలకు ఆదేశాలు ఇవ్వటం మానుకుని సంభాషించటం మొదలుపెడదాం. వాళ్ల ఇష్టాయిష్టాలు, కష్టం, సుఖం తెలుసుకుందాం. కనీస లైంగిక విజ్ఞానాన్ని అయినా మన పిల్లలకు ఇవ్వటం మొదలుపెడదాం.
– ఎస్.పుణ్యవతి,
ఐద్వా జాతీయ కోశాధికారి.