నవతెలంగాణ-పాల్వంచ
కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పి డాక్టర్ వినీత్ పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు టేబుల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రంలో ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాలు నిర్దేశించిన స్థలంలో నిలుపుదల చేయు విధంగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కేంద్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ఏర్పాట్లు పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బి ఈఈ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారిలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి రిసెప్షన్ కేంద్రాల నుండి అత్యంత పటిష్ట భద్రతతో స్ట్రాంగ్ రూముకు ఈవిఎంలు తరలించనున్నట్లు చెప్పారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.