మా పోరాటాలతోనే సమగ్ర అభివృద్ధి

మా పోరాటాలతోనే
సమగ్ర అభివృద్ధి– ఆశీర్వదించి.. అసెంబ్లీకి పంపండి
– భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహ
నిరుపేద ఇంటిలో పుట్టి కష్టనష్టాలకు ఓర్చి విద్యార్థి దశ నుండే రాజకీయాలలోకి వచ్చి ప్రజానాట్య మండలి, కులవివక్ష, వ్యవసాయ కార్మిక సంఘం వంటి ప్రజా సంఘాల్లో పని చేసిన కొండమడుగు నరసింహ సిపిఐ(ఎం) భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 35 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పని చేస్తూ సుమారు 20 సంవత్సరాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీపీఐ(ఎం) పూర్తికాల కార్యకర్తగా పనిచేశారు. ప్రస్తుతం భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గంలో సాగు, తాగునీరు మూసి కాలుష్యం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్య, వైద్యం, ఆరోగ్యము, ఉపాధి అవకాశాలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. సీపీఐ(ఎం) పోరాటాలతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తనను ఆశీర్వదించి..గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు. నవ తెలంగాణతో కొండమడుగు నరసింహ మాట్లాడుతూ..
నియోజకవర్గంలో గుర్తించిన సమస్యలు… ?
భువనగిరి నియోజకవర్గంలో పునాది గాని కాలువ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు పూర్తి కాలేదు. వనపర్తికత్వలోకి గోదావరి జలాల కోసం బస్వాపురం రిజర్వాయర్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి భూనిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదు మూసి జల కాలుష్యము, పరిశ్రమల వాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యాలయాలు లేవు. కవులు కళాకారులకు సాంస్కృతిక భవనము, టౌన్‌ హాల్‌ లేదు. క్రీడాకారుల కోసం అవుట్‌డోర్‌ స్టేడియం ఏర్పాటు చేయాలి. మహిళల కోసం ప్రత్యేకమైన మహిళ వైద్యశాల, వారి ఉపాధి కోసం వృత్తి, విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్వే ప్రయాణికుల కోసం హాల్టింగ్‌ సమస్య ఉంది.
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు మీకు ఉన్న తేడా?
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైల శేఖర్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కి కనీసం ప్రజా సమస్యలపైనా, నియోజకవర్గ సమస్యలపైనా అవగాహన లేదు. వ్యాపార సంబంధాలు తప్ప రాజకీయాల్లో ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు. తాను 1992 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. కళాకారునిగా ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత, చదువు వెలుగు కార్యక్రమంలో ప్రతి గ్రామంలో తిరిగి చైతన్యవంతం చేశాను.

 

Spread the love