కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి

పెట్టుబడిదారి వ్యవస్థలో, రోజురోజుకూ తీవ్రమవుతున్న సంక్షోభాలు, గతంలో ఎన్నడూలేని విధంగా మహమ్మారి విస్తరణ, గత ఎనిమిది దశాబ్దాలలో ఎరుగని రెండవ ప్రపంచ మాంద్యం, పై అంశాలు, నయా ఉదారవాద నమోనా డొల్లతనాన్ని, అనాగరికతను బహిర్గతంచేశాయి. అత్యధికులలో, పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, ఆకలి, మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధుల పట్ల పాలక పక్షాలు తీవ్రమైన ఉదాసీనతతో కూడిన వైఖరిని అవలంభించాయి. ఇదే సమయంలో, అతికొద్దిమందిగా ఉన్న కార్పొరేట్‌ కుబేరులకు, మహమ్మారి వలన ఏర్పడిన అత్యంత వినాశకర పరిస్థితిలో కూడా, గరిష్టంగా లాభాలు సమకూర్చే పనిలో నిమగమైంది. గత రెండు సంవత్సరాల మహమ్మారి వ్యాప్తి కాలంలో, ప్రపంచ జనాభాలో 99శాతం ప్రజలందరి రెండురెట్ల సంపదను ప్రపంచంలోని ఒక శాతం ధనవంతులు పోగుచేసుకున్నారు. భారత దేశంలోని ప్రజలు అప్పులతో, పేదరికం, నిరుద్యోగం, ఆకలితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలమైన ఆప్త మిత్రులు సంపదను కూడబెట్టుకోవడాన్ని చూస్తున్నాం. దేశంలోని 40శాతానికి పైగా సంపద జనాభాలో ఒక శాతం వద్ద ఉన్నది. భారత దేశంలోని బిలినియర్స్‌ సంఖ్య 2021లో 102 నుండి 166కు పెరిగింది. దీనికి భిన్నంగా, ప్రపంచంలోనే అత్యధికంగా, 23 కోట్ల మంది భారత ప్రజలు పేదరికంలో నివసిస్తున్నారు. అత్యంత దారుణమైన తిరోగమనంతో కూడిన అనాగరిక చర్యేమంటే, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు తామున్న ప్రదేశం నుండి ఒకేసారి సామూహిక వలసలు చేపట్టవలసిరావడం, ఆక్సిజన్‌తో పాటు, కనీస ఆరోగ్య వసతుల కొరత వల్ల గంగానదిలో శవాలు తేలడం, అదే సమయంలో మతతత్వ పాలకులు ‘పీఎం కేర్స్‌’ పేరుతో కోట్ల రూపాయలను పోగు చేసుకున్నారు. ఇదే సందర్భంలో వారి ఆశ్రితులు సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను ఇతర వనరులను స్వాధీనం చేసుకొని సంపదలను కూడబెట్టుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాల మోడీ బీజేపీ పాలనను గమనించినట్లయితే… గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా, రైతాంగం, వ్యవసాయ కార్మికులు రోజువారీ కూలీలు, నిరుద్యోగ యువతతో పాటు భారీ సంఖ్యలో నాలుగు లక్షల పైగా ప్రజలు నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రమై ప్రజలు, రైతాంగం పేదరికంలోనికి నెట్టి వేయబడటమే కాక, తమ ఉపాధికవసరమైన, కనీస వనరులను కోల్పోయారు. ఇది అనిశ్చిత పరిస్థితులకు దారి తీసింది. కార్పొరేట్‌ అనుకూల, మతపరమైన, నయా ఉదారవాద విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని, పోరాటాలతో కట్టడి చేయడానికి, కార్మిక వర్గం, రైతాంగం చైతన్య వంతమైన ఐక్య ఉద్యమాలను నిర్మించాయి. ఒక దశాబ్ద కాలపు నిరంతర కృషి, ప్రక్రియ ద్వారా, సమిష్టి నిర్ణయాలు, సమన్వయంతో కూడిన ఐక్యకార్యాచరణ, ఉత్పత్తి వర్గాలైన ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ, సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, ఆల్‌ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం దృఢమైన ఐక్యత ద్వారా ఇది సాధ్యమైంది. ఐక్య వర్గ కార్యాచరణ కేవలం సంఘీభావ ప్రకటనలు, లాంఛనమైన మద్దతు వరకే కాక, భాగస్వామ్యంతో ఈ సంఘాలలోని ప్రతి ఒక్క విభాగం స్వతంత్రంగా ఉద్యమాలు నిర్వహించుకునే వైపు మార్పు చెందాయి. 2018లో కార్పొరేట్‌ మీడియా ఎర్రజెండాపై గోరీ మీద రాతలు(కారు కూతలు) రాయడంలో నిమగమై ఉన్న సమయంలో ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ, సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో అత్యంత మిలిటెంట్‌ పోరాటాలు జరిగాయి. ఆగస్టు 9న క్విట్‌ ఇండియా దినోత్సవంపై ఉధృతంగా సాగిన ప్రచారోద్యమం తరువాత, శాసనో ల్లంఘనం, భారీ ఉమ్మడి ప్రచారంతో పాటు స్వచ్ఛందంగా కోర్టు అరెస్టులకు సిద్ధపడటం, జైలు భరో కార్యక్రమాలు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దీని వెను వెంటనే మూడు సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటి ఉమ్మడి సమీకరణ జరిగింది. సెప్టెంబర్‌ 5న, కార్మిక, కర్షక ఐక్యత అనే ప్రాథమిక మార్గ మార్గదర్శక సూత్రాన్ని బలపరుస్తూ మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ప్రదర్శన జరిగింది.కార్మకులు, కర్షకులు గ్రామీణ భారత్‌ హర్తాళ్‌కు ఏకకాలంలో పిలుపునివ్వడం అనేది కార్మికవర్గం సార్వత్రిక సమ్మెల ప్రధాన లక్షణం. ఈ నిరంతర పోరాటాలు, మోడీ నాయకత్వంలోని నిరంకుశ, కార్పొరేట్‌, మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించాయి. మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ కాలంలో, ప్రపంచమంతా వ్యాధితో పోరాడుతున్న సమయంలో, అన్నిచోట్ల భయంతో కూడిన వాతావరణం నెలకొన్న సందర్భంలో, లాక్‌డౌన్‌ విధించిన నెల రోజుల లోపే, ఈ మూడు సంఘాల చొరవతో ఆర్థిక సహకారం కోసం, ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి చట్టం ప్రకారం ఉపాధి, నిరుద్యోగ వేతనాలు, సార్వత్రిక వైద్య, ఆరోగ్య సౌకర్యాలు, సామాజిక భద్రతల కోసం డిమాండ్‌ చేస్తూ కార్మిక వర్గం ముందుకు వచ్చింది. అయితే, బీజేపీ ప్రభుత్వం రైతాంగం పై, కార్మిక వర్గం పై దాడులతో ప్రతీకారం తీర్చుకుంటూ, తన కార్పొరేట్‌ మిత్రులకు భారీ ఎత్తున రాయితీలు ఇచ్చింది. మూడు కార్పోరేట్‌ అనుకూలమైన రైతు చట్టాలు భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ రంగానికి అప్పగించే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. కార్మికవర్గం కష్టపడి సాధించుకున్న హక్కులను గుంజుకొనే లేబర్‌ కోడ్లు, అంతులేని లాభాలను పెంచే లక్ష్యంతో, హద్దులులేని దోపిడీ విధానాలను, అప్రజాస్వామిక పద్ధతుల్లో తీసుకొని వచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇది మన రాజ్యాంగ పరమైన, సమాఖ్య విధానాన్నే దెబ్బతీసింది. కార్మికులు, రైతాంగం ఈ చర్యలను తమ శక్తి వంచన లేకుండా ప్రతిఘటించాయి. నవంబర్‌ 26, 2020న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వగా, రైతుల సమస్యల ఆధారిత ఐక్యతా సంస్థ, సంయుక్త కిసాన్‌ మోర్చాలు గ్రామీణ భారత హర్తాల్‌కు పిలుపునిచ్చాయి. దేశ రాజధానికి పొరుగున ఉన్న రాష్ట్రాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 380రోజులు పాటుసాగిన ఈ ఉద్యమం వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక వర్గం చురుకైన భాగస్వామ్యంతో సాగిన దృఢమైన పోరాటం. 750 మంది రైతుల బలిదానంతో బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కు తీసుకునేలా చేసింది. ఈ ప్రతిఘటన నేపథ్యంలో లేబర్‌ కోడ్లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ విజయం సాధించడానికి సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణల మధ్య సమన్వయమే ప్రధాన కారణం. విద్యుత్‌ సవరణల ఉపసంహరణ కూడా ఎస్కేయం, కార్మిక వర్గాల పోరాటాల డిమాండ్‌ ఫలితం అనే విషయాన్ని గమనించాలి. కార్మికులు, కర్షకులు కష్టపడి సాధించుకున్న పరిరక్షణను వక్కాణిస్తూ ఏప్రిల్‌ 5, 2023న ఢిల్లీలో మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. నిరంకుశ కార్పొరేట్‌, మతోన్మాద, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. 2023వ సంవత్సరం కీలకమైంది కావడంతో, వర్గ సమస్యలను దేశ ఎజెండాలో ఉంచేందుకు, ప్రజానుకూల ప్రత్యామ్నాయ వాతావరణం నెలకొల్పేందుకు అవసరమయ్యే నిరంతర నిరసనల ప్రారంభానికి ఈ ర్యాలీ ఓ సూచిక. కార్మిక, కర్షక పోరాటాలో, ఇదొక అతిపెద్ద పోరాటంగా గుర్తించబడేందుకు లక్షల సంఖ్యలో ప్రజా సమీకరణ జరగాలి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పోరాట సందేశం చేరవేయాలి. కార్మికులు, కర్షకులు, కష్టజీవులను ఇంటింటి ప్రచారం ద్వారా గతంలో కలువనివారిని కలిసేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ నివాసాలకు చేరుకునేందుకు, శ్రేయోభిలాషులనను సమీకరించేందుకు ఉధృతంగా ఉమ్మడి ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్‌ 5న జరగబోయే మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష ర్యాలీ సీ2+50 శాతం కనీస మద్దతు ధరకు హామీ, నెలకు కనీస వేతనం రూ.26వేలు, గ్రామీణ ఉపాధి చట్టం కింద రోజుకు రూ.600లు తగ్గకుండా 200పని దినాలు, ఆహార భద్రత, విద్యుత్‌ చట్ట సవరణల ఉపసంహరణ, సామాజిక భద్రత, పెన్షన్ల లాంటి సమస్యలను, రైతులు, కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతుంది. రాష్ట్రాల ఫెడరల్‌ హక్కులు, ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, హిందూత్వ ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఈ ర్యాలీ నయా ఉదారవాద, కార్పొరేట్‌- మతోన్మాద పాలనకు ఇదొక దృఢమైన రాజకీయ సైద్ధాంతిక సవాల్‌. ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాల్ని ముందుకు తీసుకుపోయే ఒక ఐక్య కార్యాచరణ.ప్రజానుకూల ప్రత్యా మ్నాయ విశాల ఐక్యతా నిర్మాణానికి, ప్రజాశత్రువులకు నిర్ణయాత్మక ఓటమిని అందించే ఒక ఆధారంగా ఈ ర్యాలీ పని చేస్తుంది.
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
– డాక్టర్‌ విజ్జూ కృష్ణన్‌
9490300111

Spread the love