ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

– ఫస్టియర్‌కు 91.22, సెకండియర్‌కు 87.42 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1కు 93,008 మంది దరఖాస్తు చేయగా, 84,835 (91.22 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. 8,173 (8.78 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో ముగ్గురిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2కు 31,298 దరఖాస్తు చేసుకుంటే, 27,359 (87.42 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 3,939 (12.58 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు. సూర్యాపేట, సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పరిశీలకులు సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారని పేర్కొన్నారు.

Spread the love