– మీడియంలో 93.55 శాతం మందికి సీట్లు
– కామర్స్‌లో చేరేందుకే ఎక్కువ మంది మొగ్గు
– దోస్త్ తొలివిడతలో 73,220 మందికి సీట్ల కేటాయింపు
– 63 కాలేజీల్లో సున్నా ప్రవేశాలు
– బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సుకు ఆదరణ
– మరిన్ని కాలేజీల్లో ప్రవేశపెడతాం
– నాన్ దోస్త్ కళాశాలలకు కొత్త కోర్సుల అనుమతి ఇవ్వం : నవీన్ మిట్టల్, లింబాద్రి దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపు వివరాలు
మొత్తం కాలేజీలు – 889
మొత్తం సీట్లు – 3,56,258
వెబ్‌ఆప్షన్లు ఇచ్చినవారు – 78,212
సీట్లు పొందిన వారు – 73,220
మిగిలిన సీట్లు – 2,83,038
తక్కువ ఆప్షన్లతో సీట్లు పొందనివారు – 4,992
సున్నా ప్రవేశాలున్న కాలేజీలు – 63
కోర్సుల వారీగా సీట్ల కేటాయింపు
ఆర్ట్స్ – 7,771 (10.61 శాతం)
కామర్స్ – 33,251 (45.41 శాతం)
లైఫ్ సైన్సెస్ – 16,434 (22.44 శాతం)
ఫిజికల్ సైన్సెస్ – 13,468 (18.39 శాతం)
డాటాసైన్స్, ఏఐ/ఎంఎల్ – 1,955 (2.67 శాతం)
డీ ఫార్మసీ – 254 (0.35 శాతం)
ఇతర – 87 (0.12 శాతం)
మీడియం వారీగా సీట్ల కేటాయింపు
ఇంగ్లీష్ మీడియం – 68,494 (93.55 శాతం)
తెలుగు మాధ్యమం – 4,226 (5.77 శాతం)
హిందీ మాధ్యమం – 9 (0.01 శాతం)
ఉర్దూ మాధ్యమం – 484 (0.66 శాతం)
అరబిక్ మాధ్యమం – 7 (0.009 శాతం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీలో ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపులో 93.55 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో సీట్లు పొందడం గమనార్హం. గతేడాది ఇంగ్లీష్ మీడియంలో 90.89 శాతం మందికి సీట్లు వచ్చాయి. ఈ ఏడాది 2.66 శాతం అధికంగా చేరేందుకు మొగ్గు చూపారు. ఇక తెలుగు మాధ్యమంలో కేవలం 5.77 శాతం మంది సీట్లు పొందారు. గతేడాది ఈ మాధ్యమంలో 8.26 శాతం మందికి సీట్లు కేటాయించారు. ఈ ఏడాది 2.49 శాతం మంది తగ్గడం గమనార్హం. హిందీ మాధ్యమంలో తొమ్మిది మంది, ఉర్దూ మాధ్యమంలో 484, అరబిక్‌లో ఏడుగురికి సీట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలన్నా ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిన వారికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నది. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆ మాధ్యమంలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి శుక్రవారం తొలివిడత సీట్లు కేటాయించారు. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ దోస్త్‌కు తొలివిడతలో 1,05,935 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 78,212 మంది విద్యార్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. 73,220 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లు నమోదు చేయకపోవడం వల్ల 4,992 మంది విద్యార్థులు సీట్లు పొందలేకపోయారని అన్నారు. మొదటి ఆప్షన్‌తోనే 53,032 మంది, రెండో ఆప్షన్‌తో 19,909 మంది విద్యార్థులు సీట్లు పొందారని వివరించారు.
డిగ్రీలో మిగిలిన 2.83 లక్షల సీట్లు
రాష్ట్రంలో 889 (గురుకులాలు కలిపి) డిగ్రీ కాలేజీల్లో 3,56,258 సీట్లున్నాయని నవీన్ మిట్టల్, లింబాద్రి చెప్పారు. అందులో 73,220 మందికి సీట్లు కేటాయించామన్నారు. దీంతో డిగ్రీ కాలేజీల్లో 2,83,038 (79.45 శాతం) సీట్లు మిగిలిపోయాయని వివరించారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈనెలాఖరులోగా విడుదల చేస్తామన్నారు. దోస్త్ తర్వాతి విడతల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతారని అన్నారు. డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌లోనే ఎక్కువ మంది చేరేందుకు మొగ్గు చూపుతున్నారని వివరించారు. 33,251 (45.41 శాతం) మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. బీకాం కంప్యూటర్ కోర్సులో చేరేందుకు 1,04,687, బీకాం జనరల్‌లో చేరేందుకు 12,651 వెబ్‌ఆప్షన్లను విద్యార్థులు నమోదు చేశారని వివరించారు. ఆర్ట్స్‌లో 7,771 (10.61 శాతం), లైఫ్‌సైన్సెస్‌లో 16,434 (22.44 శాతం), ఫిజికల్ సైన్సెస్‌లో 13,468 (18.39 శాతం), డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్)లో 1,955 (2.67 శాతం), డీఫార్మసీలో 254 (0.35 శాతం), ఇతర కోర్సుల్లో 87 (0.12 శాతం) మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని చెప్పారు. సీట్లు పొందిన వారిలో అబ్బాయిలు 29,107 (39.75 శాతం), అమ్మాయిలు 44,113 (60.25 శాతం) మంది ఉన్నారని వివరించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 20.5 శాతం అధికంగా సీట్లు పొందిన వారిలో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 63 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయని వివరించారు. సీట్ల కేటాయింపు వివరాలను విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించామన్నారు. ప్రయివేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు ష్ట్ర్‌్‌జూర://సశీర్.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించి ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చే విద్యార్థులు రూ.500, రానివారు రూ.వెయ్యి చెల్లించి ఆన్‌లైన్‌లో ఈనెల 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీట్లను రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, విశ్వవిద్యాల కాలేజీల్లో సీట్లు పొంది ఫీజురీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న వారు సెల్ఫ్‌రిపోర్టింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నాన్ దోస్త్ కాలేజీలపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీ
నాన్ దోస్త్ కాలేజీలపై అధ్యయనం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని నవీన్ మిట్టల్, లింబాద్రి చెప్పారు. 38 నాన్ దోస్త్ కాలేజీ యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. అయితే డిగ్రీలో ప్రవేశపెట్టిన కొత్తకోర్సులను నాన్ దోస్త్ కాలేజీలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. రెండో విడత తర్వాత ఏదైనా కాలేజీ లేదా కోర్సులో 15 మంది కంటే తక్కువ చేరితే వేరే కాలేజీ లేదా వేరే కోర్సులో చేరాలంటూ విద్యార్థులకు సమాచారం అందిస్తామని వివరించారు. అయితే కొత్తగా ప్రారంభించిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సుకు విద్యార్థుల నుంచి మంచి ఆదరణ వచ్చిందన్నారు. 13 ప్రభుత్వ, ఒక ప్రయివేటు కలిపి 14 డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టామని, వాటిలో 880 సీట్లుంటే, తొలివిడతలోనే 662 మంది విద్యార్థులు సీట్లు పొందారని అన్నారు. మరిన్ని డిగ్రీ కాలేజీల్లో ఈకోర్సును ప్రవేశపెడతామని చెప్పారు. ప్రభుత్వ సిటీ కాలేజీలో బీఎస్సీ ఆనర్స్ బయోటెక్నాలజీ కోర్సును ప్రారంభించామని, 60కి 60 సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. రాష్ట్రంలో ప్రముఖ డిగ్రీ కాలేజీలకు ఎక్కువ డిమాండ్ ఉన్నదని అన్నారు. నిజాం కాలేజీలో 1,050 సీట్లుంటే 35,117 మంది, ప్రభుత్వ సిటీ కాలేజీలో 1,509 సీట్లకుగాను 22,802 మంది, తెలంగాణ మహిళా వర్సిటీ కాలేజీలో 1,777 సీట్లుంటే, 19,600 మంది, సైఫాబాద్ కాలేజీలో 730 సీట్లకుగాను 12,190 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని చెప్పారు.
దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు షురూ
దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైందని నవీన్ మిట్టల్, లింబాద్రి చెప్పారు. ఈనెల 27 వరకు రిజిస్ట్రేషన్లు, వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి గడువుందని వివరించారు. దోస్త్ తొలివిడతలో సీట్లు రాని విద్యార్థులు, సీట్లు పొందినా వేరే కోర్సు లేదా కాలేజీ మారాలనుకునే వారితోపాటు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 30న సీట్లు కేటాయిస్తామన్నారు. తుదివిడత సీట్లు కేటాయించే వరకు విద్యార్థులెవరూ కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వొద్దని, ఫీజు కట్టాల్సిన పనిలేదని చెప్పారు. జులై 17 నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. కరోనా తర్వాత ఈ విద్యాసంవత్సరం సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నింజె, కళాశాల విద్యాశాఖ ఆర్జేడీ జి యాదగిరి, జెడీ డీఎస్‌ఆర్ రాజేందర్ సింగ్, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డి తిరువెంగళచారి, దోస్త్ టెక్నికల్ కోఆర్డినేటర్ గజేంద్రబాబు, ఐసీటీ అధికారి యమునారాణి, రూసా రీసెర్చ్ ఆఫీసర్ డి వసుంధర, దోస్త్ హెల్ప్‌డెస్క్ కోఆర్డినేటర్ ఎం విజయరెడ్డి, దోస్త్ టెక్నికల్ సపోర్టు సిహెచ్ కిషోర్‌కుమార్, సీజీజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ పి హేమంత్‌కుమార్, సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మతీన్‌బేగ్, ప్రాజెక్టు లీడ్ ఎం మధుకర్ తదితరులు పాల్గొన్నారు.