విద్యార్థుల జీవితాలతో చెలగాటం

Interfering with students' lives– అడ్డూ అదుపూ లేని కోచింగ్‌ కేంద్రాల వ్యాపారం
– తప్పుడు ప్రకటలతో యువతకు గాలం
– కుప్పకూలుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ
– చైనా నుంచి గుణపాఠాలు నేర్వరా?
మోడీ ప్రభుత్వం ఉద్యోగాలివ్వకుండా.. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవటంతో… అప్పోసప్పో చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుదామని నిరుద్యోగ యువత కలలు కంటోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ నిర్లక్ష్యం.. ఖజానా నింపుకోవటమే పరమావధిగా వ్యవహరిస్తుండటంతో.. కోచింగ్‌ కేంద్రాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. తప్పుడు ప్రకటనలతో గాలం వేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవటంలేదు. మరోవైపు ప్రభుత్వ విద్యావ్యవస్థ కుప్పకూలుతుంటే.. ప్రయివేట్‌ విద్యావ్యవస్థ వేళ్లూనుకునేలా సహకరిస్తోంది. భారత్‌ ఎందుకని చైనా నుంచి గుణపాఠాలు నేర్చుకోదని పలువురు విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని రావూస్‌ ఐఏఎస్‌ అకాడమీ బేస్‌మెంట్‌లో ముగ్గురు ఉద్యోగార్థులు వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఉదంతం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. దుర్ఘటన జరిగిన ఓల్డ్‌ రాజీందర్‌ నగర్‌ ప్రాంతంలో యూపీఎస్‌సీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అనేక సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. షరా మామూలుగానే….ఈ దుర్ఘటనపై విచారణను ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. బేస్‌మెంట్‌లో కోచింగ్‌ కేంద్రాలు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అనేక శిక్షణా సంస్థలను ఢిల్లీ ప్రభుత్వం మూసేసింది. విద్యా వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఓ చట్టాన్ని తీసుకొస్తానని ప్రకటించింది. కొందరు యజమానులు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరద నీరు ప్రవహిస్తున్న వీధిలో వాహనాన్ని నడిపి, ఆ నీరు కోచింగ్‌ కేంద్రం బేస్‌మెంట్‌లో చేరడానికి కారణమైన డ్రైవర్‌, యజమానిని కూడా అరెస్ట్‌ చేశారు.
కొన్ని కోచింగ్‌ కేంద్రాల యజమానులు, సీనియర్‌ ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్న మీడియా సంస్థల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చారు. ఆ మీడియా సంస్థలకు, కోచింగ్‌ కేంద్రాలకు మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. వాటి కారణంగా అవి పరస్పరం ప్రయోజనం పొందుతున్నాయి. అందుకేనేమో ఆ సమావేశంలో పాత్రికేయులు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించలేకపోయారు. ఉద్యోగార్థుల నుంచి ఎంత వసూలు చేస్తారు? మీరు రూపొందించే రీల్స్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత పేరు గడిస్తున్నారు? ఇలాంటి సురక్షితం కాని, అపరిశుభ్రత తాండివిస్తున్న ప్రదేశంలో ఇప్పటికీ తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు? వంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నా పాత్రికేయుల నోటి నుంచి ఒక్కటి కూడా రాలేదు.
ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన వారిలో ఫెయిల్యూర్‌ రేటు 99.8 శాతం ఉంటోంది. అయినప్పటికీ మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తామని విద్యార్థులను ప్రలోభ పెడతారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతారు. కానీ అందులో స్వల్ప మొత్తాన్ని కూడా మౌలిక సదుపాయాల కల్పనకు, రక్షణ చర్యలకు ఖర్చు చేయరు. ఇది మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. విద్యను వ్యాపారంగా మార్చి డబ్బులు దండుకుంటారు. యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు నడిపినా ఇంత డబ్బు రాదు. యువతకు విద్యను అందించి పట్టభద్రులను చేయడం కంటే ఉద్యోగాలు పొందేందుకు వారికి కోచింగ్‌ ఇవ్వడం ద్వారానే కోట్లాది రూపాయలు ఆర్జించవచ్చు. ఇదే నేటి మన విద్యా వ్యవస్థ దుస్థితి.
పెరుగుతున్న జీఎస్టీ వసూళ్లు
కోచింగ్‌ వ్యాపారం ఎంత పెద్దదో, అది ఎంత వేగవంతంగా వృద్ధి చెందుతోందో తెలుసుకోవాలంటే ఆ కేంద్రం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న జీఎస్టీని పరిశీలిస్తే సరిపోతుంది. 2019-20లో వసూలు చేసిన 18 శాతం జీఎస్టీ మొత్తం రూ.2,240 కోట్లు. ఐదేండ్ల తర్వాత అది ఇప్పటికే 150 శాతం పెరిగి రూ.5,517 కోట్లకు చేరింది. 2029 నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.15,000 కోట్లకు చేరతాయని అంచనా.
స్టార్‌డమ్‌తో వ్యాపారం
కోచింగ్‌ వ్యాపారం ఎంత శక్తివంతమైనదో తెలుసుకోవాలంటే దేశంలోని బడా వార్తా పత్రికల మొదటి పేజీలను చూసినా చాలు. వ్యాపార ప్రకటనల కోసం కోచింగ్‌ కేంద్రాలు భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. పోనీ వాటిలో విద్యార్థుల విజయ గాథలు ఉంటాయా అంటే అదీ లేదు. తమ కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అనుభవం, గొప్పతనాన్ని కీర్తిస్తుంటాయి. ప్రతి అధ్యాపకుడిని ఓ పెద్ద స్టార్‌గా చిత్రీకరిస్తారు. ఆయన పేరు తర్వాత సార్‌ అని పేర్కొ నడం మరచిపోరు. మహిళా అధ్యాపకురాలైతే (అరుదు గానే ఉంటారు) పేరు చివర మేడమ్‌ అని తగిలిస్తారు. సినీ పరిశ్రమను మినహాయిస్తే మన దేశంలో వ్యక్తుల బ్రాండ్‌ ఇమేజ్‌ని పెంచేది ఈ కోచింగ్‌ వ్యాపారంలోనే. ఎందుకంటే ఈ వ్యాపారం విజయవంతం కావాలంటే కోచింగ్‌ కేంద్రాల వ్యవస్థాపకులు, అధ్యాపకులు విధిగా సూపర్‌ స్టార్‌డమ్‌ను పొంది ఉండాలి.
చైనాలో ఏం చేశారు?
చైనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే మనకు ఈ దుస్థితి వచ్చి ఉండేదే కాదు. 2021లో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ రాత్రికి రాత్రే దేశంలోని ట్యూషన్‌, కోచింగ్‌ వ్యవస్థను నామరూపాలు లేకుండా చేశారు. ఈ వ్యవస్థ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తోందని, అసమానతలు సృష్టిస్తోందని, కుటుంబాల సమయాన్ని వృథా చేస్తోందని, విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తోందని చైనా ప్రభుత్వం భావించింది. మన యూపీఎస్‌సీతో సమానమైన పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్న కేంద్రాలన్నింటినీ మూసివేశారు. ఆ దేశంలో లాభాల కోసం ట్యూషన్‌ చెప్పడం నిషిద్ధం. ఐపీఓ లిస్టింగులు, షేర్ల అమ్మకాలు ఉండవు. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌పై పరిమితులు విధించారు. విలీనాలు, సేకరణలు, విదేశీ భాగస్వామ్యాల ఊసే లేదు. చైనాకు చెందిన ఎడ్‌టెక్‌ కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ట్రిలియన్‌ డాలర్లు నష్టపోయాయి. 2008లో సంభవించిన అంతర్జాతీయ ఆర్థిక కుదుపుల కారణంగా జరిగిన నష్టం కంటే ఇది అధికం. బిలియనీర్లు అయిన లారీ చెన్‌, మైకెల్‌ యూ, జాంగ్‌ బాంగ్‌క్సిన్‌లు తమ సంపదలో 50 నుండి 90 శాతం కోల్పోయారు. దీనంతటికీ ఎడ్‌టెక్‌యే కారణం.
మన దేశంలో కూడా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. కుప్పకూలిన విద్యా వ్యవస్థ స్థానంలో పుట్టుకొచ్చిన కోచింగ్‌, ట్యూషన్‌ తరహా వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున లాభాలు దండుకుంటున్న సంస్థలు, వ్యక్తుల దూకుడుకు కళ్లెం వేయాల్సి ఉంది. అలాంటి వ్యవస్థను నామరూపాలు లేకుండా నిర్మూలిస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుంది.
ప్రకటనల మాయాజాలం
ఇదంతా తెలిసి కూడా ఉద్యోగార్థులు కోచింగ్‌ కేంద్రాలకు ఎందుకు ఎగబడుతున్నారు? ఉద్యోగాలకు ఎంపికైన వారి ఫొటోలు పత్రికల మొదటి పేజీల్లో వచ్చే వ్యాపార ప్రకటనల్లో దర్శనమిస్తుంటాయి. ఫొటోలు వేయడానికి అంగీకరించినందుకు కొందరు విద్యార్థులకు డబ్బు కూడా ముట్టజెబుతారు. ఇది ఓ రకంగా లంచం లాంటిదే. అంటే కెరీర్‌లో ఇది వారి మొట్టమొదటి సంపాదన అన్న మాట. వసూలైన జీఎస్టీని బట్టి చూస్తే కోచింగ్‌ కేంద్రాల వ్యాపారం రూ.30,650 కోట్లు దాటేసింది. ఒకవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పకూలుతుంటే మరోవైపు ప్రైవేటు విద్యా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది.
కోచింగ్‌ సెంటర్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని..
– యూపీ లక్నోలో 45 నిమిషాలసేపు ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు
ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కోచింగ్‌ సెంటర్లలో భద్రతా ప్రమాణాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఓ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ లిఫ్ట్‌లో 45 నిమిషాల పాటు విద్యార్థులు ఇరుక్కున్న ఘటన యూపీలోని లక్నోలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్నోలోని గోమతి నగర్‌లో ఉన్న ఓ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థులు లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా, అది ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంతకూ లిఫ్ట్‌ తెరుచుకోకపోవడంతో వారు భయాందోళనకు గురయ్యారు. కోచింగ్‌ సెంటర్‌ యాజమాన్యానికి కాల్‌ చేసినా వారు స్పందించపోవడంతో శోభా సింగ్‌ అనే విద్యార్థిని తన భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో అతడు వెంటనే కోచింగ్‌సెంటర్‌కు చేరుకొని వెంటనే లిఫ్ట్‌లోని సమస్యను పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరాడు. వారు స్పందించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లిఫ్ట్‌ ఆపరేటర్‌ సహాయంతో లోపాన్ని సరిచేసి విద్యార్థులను కాపాడారు. లిఫ్ట్‌కు సంబంధించిన మాస్టర్‌ కీ సెక్యూరిటీ గార్డు వద్ద లేకపోవడంతో జాప్యం జరిగినట్టుగా యాజమాన్యం వెల్లడించింది. ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల యువత ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Spread the love