– ఈడీ కేసులో సుప్రీం తీర్పు
– సీబీఐ కేసులో తీహార్ జైల్లోనే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. మొత్తం ఐదు షరతులతో సుప్రీంకోర్టు బెయిల్ విధించింది. సీఎం కార్యాలయాన్ని సందర్శించడానికి వీల్లేదని, గవర్నర్ అనుమతి లేకుండా అధికారిక ఫైళ్లపై సంతకం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బెయిల్ కోసం రూ.50,000 వ్యక్తిగత పూచికత్తు చెల్లించాలని పేర్కొంది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులలో ఎవరితోనూ మాట్లాడకూడదు లేదా కేసుతో సంబంధించిన ఫైల్స్ జోలికి వెళ్లొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఈ మధ్యంతర బెయిల్‌ను పొడిగించవచ్చు లేదా ఎక్కువ మంది సభ్యులతో కూడిన బెంచ్ రీకాల్ చేయవచ్చునని సుప్రీంకోర్ట్ పేర్కొంది.
సీబీఐ కేసులో కస్టడీ పొడిగింపు
అయితే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇదే కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.