సిరిసిల్ల టూ న్యూయార్క్‌..

– పెద్దూరు అపెరల్‌పార్క్‌లోనే ఇంటర్నేషల్‌ బ్రాండ్‌ కంపెనీ ఉత్పత్తుల తయారీ
– ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో విదేశాలకు జీఏపీ కంపెనీ ప్రాడెక్ట్స్‌ ఎగుమతులు
– రెండు షిప్టుల్లో సుమారు 800మంది స్థానిక మహిళలకు ఉపాధి
– త్వరలోనే ఉత్పత్తులు ప్రారంభించనున్న టెక్స్‌పోర్ట్‌ కంపెనీ అల్లికల యూనిట్‌
– నాడు నిర్లక్ష్యానికి గురైన సిరిసిల్ల నేడు నవశకం దిశగా అడుగులు
– టిట్టర్‌లో ప్రజలతో పంచుకున్న మంత్రి కేటీఆర్‌.. వెల్లువలా రీట్వీట్‌ అభినందనలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ వస్త్ర ఉత్పత్తులు ఇప్పుడు సిరిసిల్లలో రూపుదిద్దుకుని వయా ముంబై టూ న్యూయార్క్‌కు ఎక్స్‌పోర్ట్‌ అవుతున్నాయి. జిల్లా కేంద్ర శివారులోని పెద్దూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెరల్‌ పార్క్‌లో ఇండిస్టీ నెలకొల్పిన గోకుల్‌ అపెరియల్‌ సంస్థ స్థానికంగా 800 మంది మహిళలతో జీఏపీ బ్రాండ్‌ ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. సంస్థ స్థాపించిన కొద్దిరోజుల్లోనే ఆ ఉత్పత్తులను ఇప్పుడు న్యూయార్క్‌కు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో జీఏపీ ఆర్గానిక్‌ కాటన్‌ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడం గర్వకారణమని ట్వీట్‌ చేయగా.. వేలాది మంది రీ ట్వీట్‌ చేస్తూ వెల్లువలా అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థ టెక్స్‌పోర్టు కూడా త్వరలోనే ప్రారంభవుతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీ అయిన జీఏపీ ఉత్పత్తులు బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌ వంటి దేశాల నుంచే ఎక్కువగా విదేశాల్లోకి ఎగుమతి అవుతుంటాయి. అలాంటి అదే కంపెనీకి చెందిన ఉత్పత్తులు సిరిసిల్లలోని పెద్దూరు అపెరల్‌పార్క్‌లోనే తయారై ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో శుక్రవారం ముంబై నుంచి న్యూయార్క్‌కు ఎగుమతి అయ్యాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు జవసత్వాలు నింపేందుకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్‌కు రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్పత్తులైన బతుకమ్మ చీరెలు, రంజాన్‌, క్రిస్మస్‌గిప్ట్‌ప్యాక్‌లు, కేసీఆర్‌ కిట్స్‌, ఆర్‌వీఎమ్‌ వస్త్రాల ఆర్డర్లు ఇక్కడి నేతన్నకు ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో వర్కర్‌ టూ ఓనర్‌ పథకం కింద పెద్దూర్‌లో ఆపెరల్‌, వీవర్‌ పార్క్‌లను ఏర్పాటు చేసింది. అందులోభాగంగానే ఇతర సంస్థలను, పెట్టుబడిదారులను ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న పెద్దూర్‌లో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ. 174కోట్ల వ్యయంతో అపెరల్‌పార్క్‌ను నిర్మించింది.    5వేల వరకు కుట్టుమిషన్ల ఏర్పాటుతో 8వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడ ఇండిస్టీని స్థాపించిన ‘గోకుల్‌ అపెరియల్‌ సంస్థ’కు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) రూ. 14.50కోట్ల వ్యయంతో షెడ్డును కేటాయించింది. ప్రస్తుతం ఆ ఇండిస్టీలో 800 మంది మహిళలు రెండు షిప్టుల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండెడ్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పంద ఉత్పత్తులు ఇక్కడే రెడీ అవుతున్నాయి. ఆకర్షణీయమైన బాక్సుల్లో ప్యాక్‌ చేసి మరీ నేరుగా ఎగుమతి అవుతున్నాయి. ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ కంపెనీ గ్యాప్‌ (జీఏపీ) ఆర్గానిక్‌ కాటన్‌ ఉత్పత్తులు శుక్రవారం పెద్దూర్‌ నుంచి ముంబై అక్కడి నుంచి న్యూయార్క్‌కు ఎగుమతి అయ్యాయి. తొలిసారి అంతర్జాతీయ మార్కెట్‌లోకి సిరిసిల్ల నుంచి మేడ్‌ ఇన్‌ ఇండియా ట్యాగ్‌తో ఉత్పత్తులు ఎగుమతి కావడం గమనార్హం. మరోవైపు టెక్స్‌పోర్ట్‌ ఓవర్‌సీస్‌ కంపెనీ సైతం పెద్దూర్‌ అపెరల్‌ పార్క్‌లో ఏర్పాటు అయ్యేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అల్లికల యూనిట్‌ రంగంలో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒప్పందం పూర్తయింది. కంపెనీకి అవసరమైన షెడ్డు, ఇతర పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. వచ్చే నెలలో ఆ పనులు పూర్తవనున్నట్టు అధికారులు చెబుతున్నారు. శరవేగంగానే వర్కర్‌ టూ ఓనర్‌ స్కీం పనులు ఇదే పెద్దూర్‌లో వీవింగ్‌ పార్కును సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 88 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.387.61 కోట్ల వ్యయంతో 1104 మంది వర్కర్లకు నాలుగు పవర్‌లూమ్స్‌ ఇచ్చి షెడ్డును నిర్మిస్తోంది. ఇప్పటికే 46 షెడ్డు పురోగతిలో ఉండగా నాలుగు పూర్తయ్యాయి. ఒక్కో వర్కర్‌కు 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్డు ఇవ్వనుంది. ఇప్పటికే చంద్రంపేట నుంచి పార్క్‌వరకు మిషన్‌భగీరథ వాటర్‌ పైప్‌లైన్‌ పనులూ పూర్తయ్యాయి. త్వరలోనే గైడ్‌లైన్స్‌ విడుదల చేసి లబ్ధిదారులకు అందివ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు అభినందనల వెల్లువదేశంలోనే మొట్టమొదటి సారి జీఏపీ కంపెనీ ఉత్పత్తులు సిరిసిల్ల నుంచి విదేశాలకు నేరుగా ఎగుమతి కావడాన్ని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నుంచి అంతర్జాతీయ బ్రాండెడ్‌ ఉత్పత్తులు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ట్యాగ్‌తో ఎగుమతి కావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఆయన ట్వీట్‌ను చాలా మంది రీ ట్వీట్‌ చేస్తూ వెల్లువలా అభినందనలు తెలుపుతున్నారు. న్యూయార్క్‌లో ఉండే తమకు బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌ దేశాల్లో తయారైన ఉత్పత్తులు ఇప్పుడు స్వదేశం పేరుతో తయారై రావడం సంతోషకరంగా ఉందంటూ ప్రవాసభారతీయులు స్పందిస్తున్నారు.

Spread the love