అంతర్జాతీయ కమ్యూనిస్టు ఏచూరి!

International Communist Yechury!కామ్రేడ్‌ సీతారాం ఏచూరీ మరణం అనేక మందిని కలచివేసింది. అనేక దేశాల కమ్యూనిస్ట్‌ పార్టీలు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ సందేశాలు పంపించాయి. ప్రపంచ కమ్మూనిస్టు ఉద్యమానికి ఆయన మరణం తీరని లోటని కొనియాడాయి. కామ్రేడ్‌ సీతారాం మార్క్సిస్ట్‌ మేధావి, సిద్ధాంతకర్త అని వారు గుర్తుచేసు కున్నాయి.సీతారాం గారితో అనేక సంవత్సరాలుగా పరిచయం ఉన్నప్పటికీ, పార్టీ అంతర్జాతీయ విభాగంలో పనిచేయడం మొదలు పెట్టిన తరువాత, ఆయన్ని దగ్గరిగా చూసే అవకాశం దొరికింది. అనేక విషయాలు నేర్చుకునేందుకు అది ఉపయోగ పడింది. అంతర్జాతీయ విభాగంలో చేరిన వెంటనే ఆయన ఏ విషయాలు అధ్యయనం చేయాలో మొదట చెప్పారు. పార్టీ పద్నాలుగో మహాసభలో ఆమోదించిన సైద్ధాంతిక అంశాలపై తీర్మానం ఆధ్యయనం చేయమని చెప్పారు. ఆ తీర్మానంలో అంతర్జాతీయ పరిణామాలను సరైన దృక్పధంతో అధ్యయనం చేయకపోతే జరిగే నష్టం స్పష్టంగా చెప్పబడింది. సోషలిస్ట్‌ దేశాలలో పరిణామాలను సరిగ్గా గమనించకుండా ఉండటం వలన, వారు చెప్పిన విషయాలను విమర్శనాత్మక దృక్పధంతో విశ్లేశించకపోవడం వలన కలిగే నష్టం ఆ తీర్మానం మనకి తెలియచేసింది. అందుకోసమే పార్టీకి అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషించే విభాగం అవసరం అని ఆయన నా పని ప్రాధాన్యతను వివరించారు.అంతర్జాతీయ విషయాలకు సంబంధించిన అనేక సంస్థలు తీసుకువచ్చే అధ్యయనాలు, తీర్మానాలను చదివి వాటి సారాంశం రాసి చూపెట్టమని, దాని ఆధారంగా చేసిన తప్పులను, అధ్యయనం చేయవలసిన పద్ధతిని చెప్పేవారు. వాక్యాలు చదివి వాటిని అర్థం చేసుకోవడం అంటే, వాటిలోని అంతర్లీనంగా ఉన్న విషయాలు నిగూఢ అర్ధాలను పట్టుకోవాలని, మార్క్సిస్టు దృక్పధంతో విశ్లేషించాలని నేర్పించారు. 2008లో అరబ్‌ లీగ్‌, పాలస్తీనా విముక్తి పై తమ వైఖరిని వివరిస్తూ ఒక ప్రకటన చేసింది. దాన్ని ఏ రకంగా అర్ధం చేసుకోవాలి, వివిధ అరబ్‌ దేశాలు వ్యహరిస్తున్న తీరు అయన ప్రాక్టికల్‌గా విశ్లేషించి చూపించారు. అమెరికాతో మిత్రులుగా ఉన్న దేశాలు సైతం పాలస్తీనా విషయంలో దానికి వ్యతిరేక వైఖరి ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ల ప్రయోజనాలు, సామ్రాజ్యవాద పాత్ర ఎలా అర్థం చేసుకోవాలో అయన చాల స్పష్టంగా వివరించారు.
2009లో ఢిల్లీలో అంతర్జాతీయ కమ్మూనిస్టు, వర్కర్స్‌ పార్టీల సమావేశాన్ని సీపీఐ(ఎం), సీపీఐలతో కలిసి నిర్వహిం చాము. దాదాపు 50 దేశాల నుంచి 63 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. సమావేశం ముగింపులో అన్ని పార్టీల తరుపున ఉమ్మడి తీర్మానం ప్రతిపాదించడం ఆనవాయితీ. అయితే కమ్యూనిస్ట్‌ పార్టీల మధ్యనున్న సైద్ధాంతిక తేడాలు, వర్తమాన పరిస్థిని విశ్లేషించ డంలో ఉన్న తేడాల వలన అనేక సందర్భాలలో ఉమ్మడి తీర్మానం వెలువడదు. దాని స్థానంలో ఈ సమావేశం నిర్వహించిన పార్టీల పేరుతోనే ప్రకటన వచ్చేది. మన దేశంలో జరిగే సమావేశం నుంచి ఉమ్మడి తీర్మానం రావాలని కామ్రేడ్‌ సీతారాం గారు సమావేశం జరిగిన మూడు రోజులు నిద్రాహారాలు మాని కృషి చేశారు. హాజరైన పార్టీలతో విడివిడిగా, ఉమ్మడిగా, ప్రతి విషయం మీద, పేరా, పేరా, ప్రతివాక్యం కులంకుషంగా చర్చించి, ఎక్కడ మార్క్సిస్టు దృక్పధం వీడకుండా ఉమ్మడి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించేటట్లు చూడగలిగారు. ఆ చర్చలను దగ్గరుండి చూసే అవకాశం కలిగింది. అది ఒక ప్రాక్టికల్‌ రాజకీయ పాఠశాల. ప్రపంచ పరిస్థితులను ఎట్లా విశ్లేషించాలి, ఇతరులను ఎలా కలుపుకుని వెళ్లాలి, ఏ విషయం మీద పట్టుపట్టాలి, వేటిమీద రాజీ పడవచ్చు, మన పార్టీ అవగాహనకు కట్టుబడి వీటిని ఎలా సాధించవచ్చు అయన నేర్పించిన జీవిత పాటాలు
ఈ సమావేశాల నిర్వహణలో కొన్ని పార్టీలు వర్కింగ్‌ గ్రూప్‌గా వ్యవహరిస్తాయి. కొత్తగా రావడం వలన ఒకే దేశంలోని ఒక పార్టీకి బదులు నేను వేరొక పార్టీకి వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం గురించి సమాచారం ఇచ్చా ను. తరువాత తప్పు తెలుసుకున్నాను. అంతరా ్జతీయ సమావేశం, పార్టీల మధ్య సహజంగానే ఉండే విభేదాలు, ఈ నేపథ్యంలో వాస్తవంగా నేను చేసినది పెద్ద తప్పు. భయంగానే సీతారాం గారికి చెప్పాను అయన తిట్లకు సిద్ధపడి. అందుకు పూర్తి విరుద్ధంగా, అయన నవ్వుతూ, చిన్నవాడివి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కంగారుపడకు అనిచెప్పారు. వర్కింగ్‌ గ్రూప్‌లో అన్ని పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వారు పాల్గొనడం వలన నష్టం లేదు. అయితే అసలు పార్టీ ఏదైతే ఆగ్రూప్‌లో ఉందో వారిని కూడా పిలువు అని చెప్పారు. తప్పు చేసినవారిని తిట్టడంకంటే దానిని ఎలా సరిదిద్దాలి ?అనే ఆయన ఆలోచన నన్ను చాలా ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మీటింగులకు వెళ్లినప్పుడు ఎలా వ్యహరించాలి, ఎటువంటి విషయాల మీద చర్చలు జరపాలి? అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వంటి అనేక అంశాలు అయన చెప్పేవారు. ఈ దేశంలో వారి సంస్కృతిని గౌరవించాల్సిన విధానం, అక్కడ ప్రజలను గమనించే పద్ధతి, వంటి విషయాలు నేను సమావేశాలకు వెళ్లే ప్రతిసారి చెప్పేవారు. ముఖ్యంగా సోషలిస్ట్‌ దేశాల ప్రతినిధులతో వ్యహరించాల్సిన పద్ధతుల గురించి ప్రత్యేకించి జాగ్రత్తలు చెప్పేవారు. మనలో ఎటువంటి అహంకారం లేకుండా, వారికీ సోషలిజం నిర్మించాల్సిన పద్ధతులను నేర్పించేటట్లు కాకుండా ఎలా వారితో చర్చలు జరపాలి అని అయన సోషలిస్ట్‌ దేశాలలో పర్యటించే ప్రతి ప్రతినిధి బృందానికి చేప్పవారు. సోషలిస్ట్‌ దేశాలలో వస్తున్న మార్పులను ఎలా అధ్యయనం చేయాలి? అక్కడ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఎలా చూడాలి? అనే అంశాన్ని 20వ మహాసభ సిద్ధాంత విషయాల మీద ఆమోదించిన తీర్మానం సందర్భంగా ఆయనతో పనిచేయడం ద్వారా నేర్పించారు. దౌత్యవేత్తలతో ఎలా వ్యహరిం చాలి, ప్రభుత్వ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి, విదేశాంగ విధానంలో మార్పులు ఎలా చూడాలి, ఇటువంటి అనేక అంశాలు అయన నేర్పించారు. కామ్రేడ్‌ సీతారాం గారికి మార్క్సిస్టు సిద్ధాంతంతం మీద ఎంతపట్టుందో, సినిమాలు, పాటలు, (కర్నాటక, హిందుస్తానీ సంగీతం, హిందీ, ఇంగ్లీష్‌ పాటలు), సైన్స్‌లో వస్తున్న నూతన మార్పులు, క్రీడలు వంటి అనేక అంశాలమీద కూడా అంటే పట్టు ఉండేది. అధ్యయనానికి సమయం తగ్గుతూ పోతోందని బాధపడేవారు. అధ్యయనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దని చెప్పేవారు. ఆయనకు మనం అర్పించే నివాళి ఆద్యయనం కొనసాగించడం, సమాజాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విశ్లేషించడం, సోషలిస్ట్‌ సమాజ స్థాపనకు నిరంతరం కృషి చేయడం మాత్రమే.
ఆర్‌.అరుణ్‌కుమార్‌

Spread the love