అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌– యూపీ, ముంబైకు చెందిన ఐదుగురికి రిమాండ్‌
– రూ.కోటి విలువ చేసే 254 కేజీల గంజాయి,
– 32 దేశీయ పిస్టల్‌, పదకొండు రౌండ్ల బుల్లెట్స్‌ సీజ్‌ : రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడి
నవతెలంగాణ-మియాపూర్‌
గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో రాజు అనే వ్యక్తి నుంచి ముఠా సభ్యులు గంజాయిని కొనుగోలు చేశారు. అరకు నుంచి హైదరాబాద్‌ మీదుగా యూపీ, ముంబైకు తరలించేందుకు ప్రణాళిక ప్రకారం గంజాయిని తీసుకువెళ్తున్నారు. పక్కా సమాచారం మేరకు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించి, రాజేంద్రనగర్‌లో గంజాయి ముఠాను అరెస్టు చేశారు. వారిని విచారించగా.. మూడు నెలలుగా ముంబైకి 100 కిలోలపైగా గంజాయిని సప్లై చేసినట్టు వెల్లడైంది. నదీమ్‌, సక్లేన్‌, సలీం.. ముంబైలో క్యాబ్‌ డ్రైవర్‌గా ఉంటూ అక్కడ సప్లయర్‌గా పని చేస్తున్నారు. యూపీలో సచిన్‌సింగ్‌ అనే వ్యక్తి వద్ద దేశీయ తయారీ తుపాకీని నిందితులు కొనుగోలు చేశారు. వీరి నుంచి 254 కేజీల గంజాయి, 32 దేశీయ పిస్టల్‌, 11 రౌండ్ల బుల్లెట్స్‌, రెండు కార్లు, 7 మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు జరిపారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని డీసీపీ తెలిపారు. కేవలం పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి, ముఠాను అరెస్టు చేసినట్టు చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు.

Spread the love