నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 20న ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ‘ఇన్‌స్పైర్-2022’ సివిల్ సర్వీసెస్ విజేతలతో ముఖాముఖి నిర్వహించనున్నట్టు టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ నేపథ్యం ఏదైనా పట్టుదల, వ్యూహం ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించటమనేది… సాధ్యమేనని నిరూపించిన వారితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్య అతిథిగా ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండిబోయిన రవిందర్ యాదవ్ హాజరు కానున్నారని వివరించారు. సివిల్స్ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను విజేతలు ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకుంటారని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరితో పాటు ఉస్మానియా విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్ అండగా ఉంటుందనీ, వీరి కోసం ఇప్పటికే సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని శ్రీనివాస్‌రెడ్డి తెలియ చేశారు.