భూ నిర్వాసితులను బెదిరించి..

– ఎకౌంట్‌లో నగదు జమ చేయడం పద్ధతి కాదు
– రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-బోనకల్‌
నాగపూర్‌ – అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని, వెంటనే జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ రైతులతో చర్చించి ధర నిర్ణయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, నిర్వాసితుల ఉద్యమ కన్వీనర్‌ తకేళ్ళపాటి భద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం తూటికుంట్ల గ్రామంలో మంగళవారం నాగపూర్‌ – అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి భూ నిర్వాసితులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు రైతులతో చర్చలు జరిపి రైతులను సానుకూలంగా ఒప్పించాలే గానీ రైతులను బలవంతం చేయడం, కోర్టులో డబ్బులు డిపాజిట్‌ చేస్తామని, కోర్టులో నుంచి డబ్బులు తీసుకోవడం బహు కష్టం అని బెదిరించి ఎకౌంట్‌ పాస్‌ పుస్తకాలు నకళలు వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కలెక్టర్‌ ధర నిర్ణయం చేయాల్సి ఉంటుందని, అలా కాకుండా గ్రామానికొక ధర చెప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. భూ నిర్వాసితులు ధర నిర్ణయం జరిగే వరకు, ఇతర సమస్యలు పరిష్కారంపై హామీ ఇచ్చే వరకు ఐక్యంగా భూ నిర్వాసిత రైతులు ఉద్యమం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం మండల కార్యదర్శి తూళ్ళూరి రమేష్‌, సీపీఐ(ఎం) మధిర పట్టణ మాజీ కార్యదర్శి పాపినేని రామనర్సయ్య, భూ నిర్వాసిత రైతులు నాగండ్ల శ్రీధర్‌, మందడుపు రవీంద్ర, సాధినేని వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love