– లడ్డూ కేసు ప్రాథమిక దశలోనే : ‘సిట్’ చీఫ్ త్రిపాఠి
తిరుపతి : తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్లు అందిన ఫిర్యాదుపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇతర అంశాలనూ పరిశీలిస్తున్నామని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. ఈ బృందం ఆదివారం కూడా దర్యాప్తు కొనసాగించింది. పద్మావతి అతిథి గృహంలో టిటిడి ఇఒ శ్యామలరావుతో సమావేశమైంది. అనంతరం మీడియాతో త్రిపాఠి మాట్లాడారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించామని, ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని ఎఆర్ డెయిరీపై ప్రధానంగా ఫిర్యాదు అందిందని, దీనిపై సిట్ విచారణ చేస్తోందని చెప్పారు. విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రికార్డుల స్వాధీనం, పరిశీలన
శ్రీవారి లడ్డూ కోసం వాడే నెయ్యి, యాలకులు, కలకండ, చక్కెరతోపాటు నైవేధ్యానికి వాడే నూనె, ఇతర సరుకుల కొనుగోలు రికార్డులను టిటిడి మార్కెట్ విభారరగం నుంచి సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. వీటిని తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఒక బృందం పరిశీలిస్తోంది. గత ఐదేళ్లలోనూ, అంతకు ముందు ఐదేళ్లలోనూ టిటిడికి ఎంత నెయ్యి వచ్చింది? ఎన్ని రకాల సరుకులు వచ్చాయి? వాటి నాణ్యతపై ఆరా తీస్తోంది. టిటిడికి నెయ్యి సరఫరా చేసిన చెన్నరులోని ఎఆర్ డెయిరీకి మరో బృందం వెళ్లి విచారణ చేస్తోంది. మూడో బృందం సోమవారం ఉదయం తిరుమలలోని లడ్డూపోటు, అన్నదానం తయారీ విభాగం, లడ్డూ విక్రయశాలను పరిశీలించనుంది.
దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా..?
సత్యమేవ జయతే అంటూ వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఇఒ, సిఎం చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ వీడియోలు పోస్టు చేశారు. దీని అర్థం ఏమిటి చంద్రబాబు.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా..? అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సెప్టెంబరు 18న సిఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ ఒకసారి, యాత్రికులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు మళ్లీ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. టిటిడి ఇఒ శ్యామలరావు.. ఆ ట్యాంకర్లను వాడలేదని, వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్య ప్రచారానికి దిగారని జగన్ తెలిపారు.