– ఆ సొమ్మును కక్కిస్తాం : ముత్తినేని వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ పాలనలో వికలాంగుల కార్పొరేషన్, సంక్షేమ శాఖలో జరిగిన అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఆ కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమాల కోసం వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మెన్ వాసుదేవ రెడ్డి నిధులను మళ్లించారనీ, జైలుకు పంపించి తీరుతామన్నారు. వాసుదేవరెడ్డి వికలాంగుల చైర్మెన్‌గా రూ.1.95 లక్షల జీతం తీసుకుంటూనే రూ.4,016 పెన్షన్ తీసుకున్నారని విమర్శించారు. వికలాంగుల పరికరాల కోసం కేటాయించిన రూ.28 లక్షలను వాసుదేవరెడ్డి తన కార్యాలయ సోకుల కోసం వాడుకుని, ఆ కాంట్రాక్ట్‌ను తన సొంత వ్యక్తులకిచ్చి అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ రుణాలు ఇస్తున్న సంగతి కూడా తెలియకుండా వాసు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 45 వేల మందికి పరికరాలిస్తే ఆ వివరాలు ఓబీఎంఎస్ పోర్టల్‌లో ఎందుకు లేవని ప్రశ్నించారు. వికలాంగుల కార్పొరేషన్‌లో రూ.100 కోట్లు అవినీతి జరిగిందని తాను అనలేదని ముత్తినేని వీరయ్య స్పష్టం చేశారు. రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వికలాంగుల కార్పొరేషన్‌తో పాటు సంక్షేమశాఖలో జరిగిందని చెప్పానని, విచారణ తర్వాత ఎంత అవినీతి జరిగిందనేది తేలుతుందన్నారు. అంత అవినీతి జరగలేదని వాసు అంటున్నారే తప్ప అసలు అవినీతి జరగలేదని చెప్పడం లేదని తప్పుపట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో వికలాంగుల చట్టాలను, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని పలు అంశాలను వీరయ్య ఉదహరించారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
మంత్రి తుమ్మల వాటా ఎంతో తెలుసుకో.. : వాసుదేవరెడ్డి
బీఆర్‌ఎస్ హయాంలో మొదటి టర్మ్‌లో వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావుకు అవినీతిలో వాటా ఎంత ఉందో తెలుసుకోవాలని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మెన్ వాసుదేవ రెడ్డి ప్రస్తుత చైర్మెన్ ముత్తినేని వీరయ్యకు సూచించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. వీరయ్య చేస్తున్న అవినీతి ఆరోపణల్లో ఆయన్ను కూడా భాగం చేశారా? అని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముత్తినేని వీరయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఖండించారు. పరికరాల కొనుగోలులో కార్పొరేషన్ చైర్మెన్ పర్యవేక్షణ మాత్రమే చేస్తారని, వాటి కొనుగోలుకు అధికారుల కమిటీ ఉంటుందని తెలిపారు. అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడమెందుకు? విచారణకు ఆదేశిస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. నిజంగా అవినీతి జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ అధికారులే ప్రస్తుతం కూడా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడానికి గత ప్రభుత్వంలో ఆడిట్ జరగపోవడానికి కారణమని నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. 2009లోనే వై.ఎస్ హయంలోనే 492 జి.ఓ ఇచ్చారని గుర్తుచేశారు. వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకే బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమను టార్గెట్ చేసినా సరే… కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకిచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.