– ఆదేశించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్
– డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఎంక్వయిరీ
– రెండు పీహెచ్‌సీల్లో సిబ్బందిని విచారించిన అధికారులు
– పత్రికలో వచ్చిన అన్ని అంశాలపై వివరణ తీసుకున్నట్టు సమాచారం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / ఖమ్మం
‘సూది ముట్టడు.. సిరంజి పట్టడు.. ఆ డాక్టర్ డ్యూటీయే సపరేటు’ శీర్షికన ‘నవతెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 7వ తేదీన ప్రచురితమైన కథనంపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ స్పందించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ పీహెచ్‌సీ డీడీవో/ మెడికల్ ఆఫీసర్‌గా డిప్యూటేషన్‌పై గత నెల 12వ తేదీన బదిలీ అయిన డాక్టర్ కె.రమేష్ ఓపీ విధులను నిర్లక్ష్యం చేస్తుండటంపై వివరణ కోరారు. పత్రికలో డాక్టర్ రమేష్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి.సుబ్బారావు ఆదేశాలతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం విచారణ నిర్వహించారు. కొణిజర్ల పీహెచ్‌సీ నుంచి డాక్టర్ రమేష్ గత నెల డిప్యూటేషన్‌పై మంచుకొండ పీహెచ్‌సీకి బదిలీ అయ్యారు. నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా మంచుకొండ పీహెచ్‌సీలో ఓపీ చూసిన దాఖలాలు లేవు. పైగా కొణిజర్ల పీహెచ్‌సీలోనే అటెండెన్స్ రిజిస్టర్‌లో ఓడీగా పేర్కొంటున్నారు. రమేష్‌ను డిప్యూటేషన్‌పై మంచుకొండ పంపినప్పుడే ముదిగొండ మండలం వల్లభి పీహెచ్‌సీ నుంచి డిప్యూటేషన్‌పై శారదను కొణిజర్ల పీహెచ్‌సీకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మంచుకొండలో ఓపీతో పాటు డీడీవో బాధ్యతలు చూడాల్సిన డాక్టర్ రమేష్ ఇక్కడ విధులు నిర్వహించకుండా కొణిజర్ల వెళ్తున్నారని పత్రికలో కథనం వచ్చింది. దీంతో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా రమేష్‌పై వచ్చాయి. కొణిజర్ల మండలం పెద్దగోపతి మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నప్పుడు అక్కడి పీహెచ్‌సీకి కేటాయించిన కొత్త ల్యాప్‌టాప్‌ను నిబంధనలకు విరుద్ధంగా అతనితో పాటే తీసుకొచ్చుకున్నారు. ఫలితంగా పాత ల్యాప్‌టాప్‌తోనే అక్కడ వెళ్లదీయాల్సి వస్తోంది. సిబ్బంది సముపార్జిత సెలవుల విషయంలోనూ ఆరోపణలు వచ్చాయి. మంచుకొండతో పాటు కొణిజర్ల, పెద్దగోపతి పీహెచ్‌సీల్లో డాక్టర్ రమేష్ విధి నిర్వహణలో వ్యవహరించిన తీరుపై సిబ్బందిని ఉన్నతాధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముందుగా మంచుకొండ పీహెచ్‌సీలో విచారణ నిర్వహించిన అధికారులు ఆ తర్వాత కొణిజర్ల పీహెచ్‌సీలోనూ విచారణ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, అడిషనల్ డీఎంహెచ్‌ఓ విచారణ నిర్వహిస్తుండగా డీఎంహెచ్‌వో సైతం అక్కడికి వెళ్లడం వల్ల సిబ్బందిని ప్రభావితం చేసినట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విచారణలో భాగంగా డాక్టర్ రమేష్ తాను విధుల్లో నిర్లక్ష్యం వహించలేదని, తనపై వచ్చిన ఇతర ఆరోపణలకు సంబంధించి కూడా రాతపూర్వకంగా వివరణ ఇచ్చినట్టు సమాచారం.