నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాల, ప్రభుత్వ పాఠశాలల్లో గెజిటెడ్ సంతకం విషయంలో అవినీతి జరుగుతుందని దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను వెంటనే గుర్తించి శిక్షించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. శనివారం స్థానిక జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం వారు మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో గెజిటెడ్ సంతకం కోసం పేద మధ్యతరగతి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలలోకి వెళితే అక్కడ పనిచేసే వాచ్మెన్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది డబ్బులు వసూలు చేస్తూ అధికారులతో సంతకాలు చేయించి అవినీతికి పాల్పడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుండి రూ.200 రూపాయల నుండి రూ.2000 వరకు డబ్బులు వసూలు చేసి సంతకాలు చేయిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రజలు ఒక్కొక్క సందర్భంలో డబ్బులు ఇవ్వలేక సంతకం చేయించుకోలేక వెనుకకు తిరిగి వెళుతున్నారు. ప్రధానంగా జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఈ అవినీతి మరింత పెరిగిందని వారు అన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, ఆరోగ్యపత్రం, మెడికల్ ఫిట్నెస్ పత్రం, ఆధార్ కార్డులో పేరు నమోదు, పేరు చేర్పింపు అనేక అంశాల మీద గెజిటెడ్ అధికారి సంతకం అవసరం ఉండడం వల్ల దీనిని సొమ్ము చేసుకుని కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు. వెంటనే స్థానిక అధికారులు వీరిపై దృష్టి పెట్టి బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొని కనీసం మండలానికి ఒక అధికారిక గెజిటెడ్ అధికారిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చెన్న రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం శ్రీకాంత్ ,నాయకులు బుర్రు అనిల్, రియాజ్, పవన్ లు పాల్గొన్నారు.