మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, పంజాబ్‌లో ఈడిసోదాలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ :   మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, పంజాబ్‌లోని 12కు పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) శుక్రవారం సోదాలు చేపట్టింది. చంఢఘీర్‌కి చెందిన ఔషద సంస్థ పారాబోలిక్‌ డ్రగ్స్‌, దాని ప్రమోటర్లకు సంబంధించిన బ్యాంక్‌ కుంభకోణం కేసులో ఈ సోదాలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పారాబోలిక్‌డ్రగ్స్‌ సంస్థ, ప్రమోటర్లపై రూ.1,626.7 కోట్ల బ్యాంక్‌ మోసానికి పాల్పడ్డారంటూ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) 2021లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో ఈడి కూడా వారిపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్‌లో సోదాలు చేపట్టింది. సంస్థ ప్రమోటర్లు వినీత్‌ గుప్తా (54), ప్రణవ్‌ గుప్తా (56)లతో పాటు సోనీపేటలోని అశోకా యూనివర్శిటీ సహ వ్యవస్థాపకులు సుర్జీత్‌ కుమార్‌ బన్సాల్‌(74)లను అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఈడి అరెస్ట్‌ చేసింది. నకిలీ , కల్పిత పత్రాలతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర కన్సార్టియం బ్యాంక్‌ల నుండి రుణాలు తీసుకుని మోసానికి పాల్పడినట్లు సిబిఐ పేర్కొంది.

Spread the love