కఠినమైన హిజాబ్‌ చట్టాన్ని ఆమోదించిన ఇరాన్‌ పార్లమెంట్‌

నవతెలంగాణ – టెహ్రాన్‌ : మహిళలపై ఇరాన్‌ ప్రభుత్వ తీవ్ర అణచివేత కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ ధరించేందుకు నిరాకరించే మహిళలు, వారికి మద్దతు తెలిపే వారిపై భారీ జరిమానాలు విధించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. హిజాబ్‌ ధరించని మహిళలతో విధులు నిర్వహించేందుకు అనుమతించే వ్యాపార సంస్థలతో పాటు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే కార్యకర్తలపై కూడా ఈ బిల్లు శిక్షలు విధించనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.290 మంది సభ్యులు కలిగిన ఇరాన్‌ పార్లమెంటులోని 152 మంది సభ్యులు ఈ బిల్లును బుధవారం ఆమోదించారు. కాగా, ఈ బిల్లు రాజ్యాంగపరమైన నిఘా సంస్థగా పనిచేసే మతాధికార సంస్థ గార్డియన్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందాల్సి వుంది. ఈ చట్టం మూడేళ్ల పార్లమెంట్‌ కాలానికి అమలులో ఉండనుంది. ఇటీవల ఇరాన్‌ మొరాలిటీ పోలీసుల అదుపులో వుండి మూడు రోజుల తర్వాత మరణించిన 22 ఏళ్ల మషా అమిని వర్ధంతి జరిగిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబర్‌ 16న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా సుమారు 500 మంది మరణించారు. సుమారు 22,000 మందికి పైగా ఆందోళనకారులను నిర్బంధించారు

Spread the love