– ప్రభుత్వం నుంచి అందని సాయం
– నష్టాలో ఊబిలో కూరుకుపోతున్న కౌలు రైతులు
నవతెలంగాణ- మల్హర్ రావు
పంట రుణాలు, సబ్సిడీపై ఎరువులు, బ్యాంకులో రుణాలు, ప్రభుత్వం నుంచి అందని సాయంతో కౌలు రైతులు కష్టాల కడలిలో ఉన్నారు. పట్టాదారుల వద్ద భూములు కొలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్న కౌలుదార్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందడంలేదు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయాన్నే నమ్ముకున్న కౌలురైతులు ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా కాలం కలిసిరాకపోతుండా అని వ్యవసాయాన్నే నమ్ముకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కౌలుకోసం తెచ్చిన అప్పులు కట్టలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడి తనువు చాలిస్తున్నారు.
ఏటా పెరుగుతున్న కౌలు..
కౌలు ధరలు ఏటా పెరిగిపోతున్నాయి.గతంలో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఉండేది. కానీ ప్రస్తుతం కౌలుధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు. బోర్లు, బావులు ఉన్నభూములకు మరికొంత ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది.
కాలం కలిసొస్తే సరే..
కౌలు రైతులు లక్షల్లో ఖర్చు చేసి పంటలు సాగు చేస్తుంటారు. కానీ కాలం కలిసివస్తే సరే.. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అప్పులు తీర్చలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో ఇద్దరు కౌలురైతులే ఉన్నారు.
అందని ప్రభుత్వ సాయం..
కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదు. కౌలు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తున్నా ఆచరణలో పెట్టకపోవడంతో వారికి కన్నీరే మిగులుతోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. కానీ ఎన్నికల తర్వాత దాని ఊసే ఎత్తకపోవడంతో కౌలు రైతులు మరోసారి భంగపాటుకు గురికాక తప్పలేదు.
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి: అక్కల బాపు యాదవ్…రైతు సంఘం నాయకుడు
ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. త్రీసభ్య కమిటీ ద్వారా విచారణ జరిపించి కౌలురైతులను అదు కోవాలి. 194 జీవో ప్రకారం మరణించిన రైతుకు రూ.5 లక్షల నష్టపరిహారం అందించి అదుకోవాలి.