– లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
– 11న తహసీల్దార్ కార్యాలయాల లెదుట ధర్నా చేస్తాం : కాంగ్రెస్ పార్టీ జాతీయనేత, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
నవతెలంగాణ-ములుగు
గృహలక్ష్మి పథకంలో లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఎంపికలు పారదర్శకంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క అన్నారు. శనివారం ములుగులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం అమలు చేయాలని కోరుతూ ఈనెల 11న ములుగు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన పదేండ్లలో కేసీఆర్ పాలనలో ఇండ్లు వస్తాయని గుడిసెల మీద పరదాలు వేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందన్నారు. డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్‌రూమ్ కట్టించి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ పేద ప్రజలను మోసం చేశారని, మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు గృహలకిë పథకంతో మరోమారు ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ములుగు నియోజకవర్గంలో పేదల నుంచి దరఖాస్తులు తీసుకుని అధికారులతో సర్వే చేయించారు కానీ బీఆర్‌ఎస్ నాయకులతో లబ్దిదారుల ఎంపిక చేయిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్ నాయకులు పేదల ఇండ్లకు వెళ్లి ఇల్లు మంజూరు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. పేదవారి ఆత్మగౌరవ ప్రతీక అయిన మన ఇల్లు కోసం పోరాటం చేద్దాం అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, డబ్బులు అడిగితే.. ఎందుకివ్వాలని నిలదీయాలని సూచించారు. గృహలక్ష్మి పథకంలో లబ్దిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా చేయాలని, అప్పుడే నిజమైన లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కలెక్టర్ స్పందించి అనుమానాలపై నివృత్తి చేయాలని కోరారు.