తెలంగాణలో దాదాపు అరవై శాతం జనానికి వ్యవసాయమే జీవనాధారం. అంతటి ప్రాధాన్యత గల ఈరంగం పట్ల పాలకుల చిత్తశుద్ధి కరువైంది. పేరుకు మాత్రం పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం,వాటి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడం వెరసి దశాబ్దాలుగా పనులు నత్తనడకన సాగడం, రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనితీరుకు పరాకాష్ట. సాగునీటి నిపుణులు ఎంత వారించినా గత సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నిధులన్నీ నీళ్లపాలు చేసింది. కొత్త ప్రభుత్వమైనా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేస్తుందా అంటే ఆ వైపు దృష్టే లేదనిపిస్తోంది.బడ్జెట్‌లో నిధులు కేటాయించడం వరకు బాగానే ఉన్నా వాటిలో సగం మాత్రమే ఖర్చు చేయడం మూలాన ఏడాదిలో పూర్తికావాల్సిన రిజర్వాయర్ కాస్తా ఏండ్లతరబడి కొనసాగుతున్నది. కేవలం రెండువేల కోట్ల రూపాయలతో ఏడాదిలో పూర్తయ్యే పదహారు ప్రాజె క్టులు ఉన్నా వాటిని పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. అవి పూర్తయితే దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరం దుతుంది. కమీషన్లకు కక్కుర్తి పడి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ఏటీఎంలుగా మార్చుకుందనే అపవాదు ఉంది. దాన్ని తొలగించి పనిచేయాల్సిన కాంగ్రెస్ సర్కార్ కూడా అదే విధానంతో ముందుకు సాగుతున్నదనే విమర్శ మూటకట్టుకుంటోంది.
తెలంగాణ రాష్ట్రంలో 34 భారీ ప్రాజెక్టులు, 39 మధ్య తరహా ప్రాజెక్టులు, ఒకటి ఆధునికీకరణ , వరద నివారణ ప్రాజె క్టుతో మొత్తం 75 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 31 భారీ మధ్య తరహా (24 భారీ- 7 మధ్య తరహా) 52.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. చిన్నతరహా ఎత్తిపోతల పథకాల ద్వారా 4.76 లక్షల ఎకరాలు, చెరువుల ద్వారా 29.88 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. వీటికింద ఇంకా 1.09 లక్షల ఎకరాలు, రాష్ట్రంలో మొత్తంగా 73.57 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పించాలి. ఇంకా 54 లక్షల ఎకరాలకు నీరందించాలి. ప్రస్తుతం 2025-26లో 5.05 లక్షల ఎకరాలకు, 2026-27లో 5.10 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం.2025-26 బడ్జెట్‌లో రూ.23.330.65 కోట్లు కేటాయించింది.ఇందులో భారీ మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.10,838.18 కోట్లు, చిన్నతరహా వనరులకు రూ.948.60 కోట్లు మొత్తం రూ. 11,786.78 కోట్లు మాత్రమే కేేటాయింపులు చేసింది. మిగిలిన నిధులు రుణాలకు, సిబ్బందికి వ్యయం చేస్తుంది. 2023-24లో రూ.15,488.11 కోట్లు కేటాయించి రూ.11,210.57 కోట్లు వ్యయం చేసింది. 2024-25లో రూ.11,210.57 కోట్లు కేటాయించి ఫిబ్రవరి 25వరకు రూ.6,946.66 కోట్లు మాత్రమే కేటాయించింది. నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చుచేసి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభంలో జూరాల ప్రాజెక్టునుండి రూ.38,500ల కోట్లతో 2004లో అప్పటి ప్రభుత్వం రూపొందించింది. దాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ- డిజైన్‌చేసి జూరాల నుండి 250 కిలోమీటర్ల దిగువన గల శ్రీశైలం వెనుక నీటి నుండి ఎత్తి పోతలుగా 2016లో మార్చింది. రీ-డిజైన్ తర్వాత 3 ఫిబ్రవరి2025 నాటికి రూ.32,662 కోట్ల వ్యయం చేసింది. ఇంకా రూ.43వేల కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్,(2,35,319 ఎకరాలు) నాగర్‌కర్నూల్ 1,03,389, నారాయణపేట్ 1,60,955, రంగారెడ్డి 3,59,046, వికారాబాద్ 3,41,952, నల్లగొండ 26,339 ఎకరాలు మొత్తం 12.30లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు, 30టీఎంసీలు హైదరాబాద్‌కు తాగునీటికి సరఫరా చేయాలి. దిండి ఎత్తిపోతలను నార్లపూర్ నుండి నిర్మాణానికి మార్పుచేసింది. దిండి ఎత్తిపోతలకు రూ.6,190 కోట్ల పరిపాలన ఆమోదంతో ప్రారంభించింది. రూ.1800ల కోట్లతో ఐదు ప్యాకేజీలు 2026 సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలి.పాలమూరు ఎత్తిపోతల ప్రధాన ప్రాజెక్టులు నార్లపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్, వట్టెం రిజర్వాయర్, కరివెన రిజర్వాయర్, ఉదండాపూర్, ప్రాజెక్టులు పూర్తయ్యా యి. కానీ, కాల్వలు ప్రారంభించలేదు. ఈసారి బడ్జెట్‌లో రూ.1,714 కోట్లు మాత్రమే కేటా యించడంతో పనులు ఇంకెప్పుడు పూర్తయ్యేను అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల 2005లో ప్రాణహిత – చేవెళ్ల పథకం పేరుతో రూ.18,500ల కోట్లతో ప్రారంభించింది. ప్రాణహిత నుండి ఎల్లంపల్లికి లిఫ్ట్‌ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 140 టీిఎంసీలు ఎత్తిపోయాలి. ఎల్లంపల్లి నుండి మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, చేవెళ్లకు నీటిని అందించాలి. దీన్ని రీ-డిజైన్ ద్వారా ప్రాణహితకు బదులు గోదావరి నదిపై ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేసింది. మేడిగడ్డ వెనకనీటితో అన్నారం, సుండిల్ల ద్వారా ఎల్లంపల్లికి పంపాలి. అక్కడి నుండి మిడ్‌మానేరు ద్వారా గత డిజైన్‌నే అమలు చేయాలి. రీ-డిజైన్ వల్ల ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.25 లక్షల కోట్లకు పెరిగింది. ఇంతవరకు రూ.1.10 లక్షల కోట్లు వ్యయం చేసింది. కానీ, ప్రాజెక్టు ప్రారంభించిన నెల రోజుల్లో 2023లో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది. అన్నారం సుందిల్లకు బుంగలు పడ్డాయి. ఈ విధంగా ఈ మూడు ప్రాజెక్టులు పనికిరాకుండా పోయాయి. కాళేశ్వరం ఏడో బ్లాక్‌లో కుంగిన ఫిల్లర్లపై విజిలెన్స్ విచారించి 22మార్చి 2025న నివేదిక ఇచ్చింది. 17 మంది ఇంజనీర్లపై క్రిమి నల్ కేసులు చేపట్టాలని, మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి పై కూడా చర్యలకు సిఫారసులు చేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం- సుందిల్ల ప్రాజెక్టులపై కూడా విచారణ సాగింది. నిర్మాణ లోపాలతో పాటు క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్, మెయింటేనెన్స్ విభాగాల్లో పనిచేసే వారిపై చర్యలు చేపట్టాలని అదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లలో నీటిని నిల్వ పెట్టరాదని సలహా ఇచ్చింది. రానున్న కాలంలో ఈ మూడు ప్రాజెక్టులను వినియోగించరాదని నేషనల్ డ్యామ్ సేప్టీ శాఖ కూడా సూచించింది. ఈ ప్రాజెక్టు పునర్ నిర్మాణం చేయడానికి రూ.20 వేల కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టు నిర్వాహణ ద్వారా ఎకరాకు ప్రభు త్వం రూ.40వేలు రాయితీగా భరించాలి. ఈ మూడు ప్రాజెక్టులను తొలగించి ప్రాణహితనుండి ఎల్లంపల్లికి నీరు తేవడం ద్వారా ఎల్లంపల్లినుండి దిగువ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. ప్రాణహిత- ఎల్లంపల్లి – గంధమల్ల రిజ ర్వాయర్ వరకు నీటిని ఉపయోగించినచో ప్రభుత్వంపై ఎకరాకు రూ.10వేలు మాత్రమే వ్యయం చేయాలి అందువల్ల ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
లక్ష్యం సరే, చిత్తశుద్ధే కావాలి..
గతంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేర్లతో ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు రూ.6వేల కోట్లతో ప్రభుత్వం పథకాలు చేపట్టింది. సీతారామ సాగర్ రీ-డిజైన్‌వల్ల ఆయకట్టు 6.5 లక్షల ఎకరాలకు పెంచుతూ రూ. 30వేల కోట్ల అంచనాలతో నిర్మాణం మొదలుపెట్టింది. 2025-26 బడ్జెట్‌లో రూ.709.35 కోట్లు కేటాయిం చింది.దీన్ని వచ్చే వానాకాలం వరకు పూర్తి చేయాలని లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. సీతారామ సాగర్ నుండి ఏన్కూర్ వరకు అనుసంధాన కాల్వ నిర్మించాలి. చిన్న కాళేశ్వరం, మోడికుంట, లోయర్ పెనుగంగా, చనకా-కొరటా, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ సాగర్, కొయిల్‌సాగర్, రాజీవ్ భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, దిండి, ఎఎంఆర్ ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బిసి టన్నెల్, శ్రీరాంసాగర్ 2వ దశ, సదర్‌మాట్, నీల్‌వారు, పాలెంవాగులు 75 శాతం పూర్తయ్యాయి. వీటిని రానున్న సంవత్సరంలో పూర్తి చేయాలని బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుండి ఎఐబిపి కింద మోడికుంట, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల, దిగువ పెనుగంగా, చనాక-కొరట ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరింది. అలాగే, కడెం ప్రాజెక్టు, లోయర్ మానేరు ప్రాజెక్టుకు పూడిక తీయడానికి డ్రెడ్జింగ్ చేయడానికి ప్రభుత్వ ఖర్చు లేకుండా ”జాతీయ పూడికతీత – 2022”తో పనులు చేయించాలని కేంద్రాన్ని కోరింది. 450 చిన్న లిఫ్ట్‌లు రిపేర్లు చేయాలి. హుజూర్‌నగర్ కోదాడలో పనులు త్వరాగా ప్రారంభించాలి. ఇంత వరకు ప్రాజెక్టుల భూ సేకరణకు 5.04 లక్షల ఎకరాలు సేకరించాల్సి ఉండగా 3.89 లక్షల ఎకరాలు సేకరించింది.ఇంకా 1.147 లక్షల ఎకరాలు సేకరించాలి. నిర్వాసితులకు 30,870 గృహ నిర్మాణాలు, 48,183 ఇండ్ల పట్టాలిచ్చింది. డిసెంబర్ 2024 వరకు రూ.2,747 కోట్ల వ్యయంతో 46,904 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించింది.ఇంకా 14వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. నీటి పారుదల శాఖలో 675 ఏయి పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 500ల మందిని భర్తి చేయాల్సి ఉంది.
చిక్కువీడని అంతర్రాష్ట్ర సమస్యలు
ఆంధ్రా, తెలంగాణ మధ్య ఉన్న నీటి సమస్యను కేంద్రం తేల్చడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య తగదా పెట్టి చోద్యం చూస్తున్నది. సమస్యను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా బ్రిజేష్ ట్రిబ్యునల్ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నది. ఈ మధ్యకాలంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయమై ఘర్షణా వాతావరణం తలెత్తగా దాన్ని సున్నితంగా పరిష్కరించాల్సింది పోయి ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర జలవనరుల శాఖకే అప్పజెప్పాలని కేంద్రం అడుగుతున్నది. అంటే క్రిష్ణా మీద, జూరాల నుంచి, నాగార్జున సాగర్‌పై నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తమ ఆధీనంలో ఉంచుకుని ఎవరికి ఎంత నీటి వాటాను ఇవ్వాలో నిర్ణయిస్తుందన్నమాట! అంటే రాష్ట్రాలు తమ చెప్పుచేతల్లో ఉండాలనే వేస్తున్న ఎత్తుగడగా ఇది కనిపిస్తున్నది తప్ప సమస్యను పరిష్కరించే ఉద్దేశం అస్సలు కనపడటం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్రిష్ణా రివర్‌బోర్డు మేనేజ్‌మెంట్‌కు ప్రాజెక్టులకు అప్పగించరాదని శాసససభలో తీర్మానం చేసింది. కేఆర్‌బీఎం అధికార పరిధిపై సుప్రీంకోర్టులో కేసు వేసింది. అయితే ఏపీ నిర్మిస్తున్న గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పింది. దీనివల్ల గోదావరి నీటిని తెలంగాణ ఉపయోగించుకోకుండా నష్టం వాటిల్లుతుంది.
వీటికి సంబంధించిన వివాదాలు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు నడుస్తున్నాయి. 2004లో వేసిన ట్రిబ్యునల్ నేటికీ మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పరిష్కారం చేయడంలో విఫలమౌతున్నది. ప్రతియేటా నీటి వనరులకు కేటాయించిన నిధులు వ్యయం చేయడం లేదు. మైనర్ ఇరిగేష్ ఐడిసి లిఫ్ట్ పథకాలు, చెరువులు, మధ్య తరహా ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలి. భారీ ప్రాజెక్టులను నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలి. ఇందుకు తగిన నిధులు కేటాయించాలి. అప్పుడు మాత్రమే ప్రాజెక్టుల సమస్య పరిష్కారమవుతుంది. రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు దాటినా నీటి పంపిణీ వివాదాన్ని పరిష్కరించకుండా ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం ఘర్షణ పెట్టిన తీరు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666