– ప్రతి గ్రామానికీ బీటీ రోడ్ల నిర్మాణం
– పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి : మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – ఆత్మకూరు
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కురుమూర్తి స్థాన దేవస్థానానికి రూ.110 కోట్లతో నిర్మించనున్న కారిడార్ రోడ్డు, ఘాట్‌రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. వారం క్రితం స్థానిక ఎమ్మెల్యేలకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. సుమారు 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయానికి పేదల తిరుపతిగా పేరుగాంచిందని, ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో విశిష్టత ఉందని తెలిపారు. అయినా ఇక్కడ వసతుల కొరత ఉందని, అందుకే దేవాలయ అభివృద్ధితో పాటు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎమ్మెల్యే సూచనలతో నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు.
వలసలకు మారుపేరుగా ఉన్న పాలమూరు జిల్లాలో కిలోమీటర్ల కొద్ది కృష్ణమ్మ ప్రవహిస్తున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లడం దురదృష్టకరమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ అభివర్ణించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న నెట్టెంపాడు, పాలమూరు, తదితర అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. మక్తల్, నారాయణపేట ప్రజలు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రాజెక్టులు పూర్తిచేసి కృష్ణానీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొందరు అభివృద్ధిని ఆడ్డుకోవడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వారిని తన జిల్లా ప్రజలు క్షమించరని అన్నారు. ఒకవేళ అడ్డుకుంటే జిల్లా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పారు. పాలమూరు జిల్లా నుంచి 2 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అమరరాజా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. బీటి రోడ్డు లేని గ్రామం, తండా రాష్ట్రంలో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. విద్యా వైద్యం, ఉపాధిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహతో ప్రతినెలా సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజ నర్సింహ, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, డా. వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ సుధాకర్ రెడ్డి, సీతా దయాకర్, మైనార్టీ కార్పొరేషన్ అధిపతి ఒబేదుల కోత్వాల్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర, జిల్లా ఎస్పీ జానకి, సంస్థానాదేశులు అధ్యక్షులు శ్రీరాం భూపాల్, ఆలయ చైర్మెన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.