ఇన్సూరెన్స్‌ కథనేనా..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం భాగంలోగా… ‘వర్షాల్లో బైకులు కొట్టుకుపోయిన వారికి బైకులు కోనిస్తాం… కార్లు ఆగమైనోళ్లకు కార్లు కొనిస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఎంపీ బండి సంజరు ఊదరగొట్టిండు. అరె కుషాలుకొద్దీ పోరలు ముగ్గురు కలిసి బైకుల మీద పోతే చలాన్లు వేస్తరా? అవన్నీ రద్దు చేయిస్తామని కూడా చెప్పేశాడు. బాధితులు నిజమో కాబోలు అనుకున్నరు. గిదే విషయంపై మీడియా వాళ్లు బైకులు ఎట్ల కోనిస్తరు… కార్లెట్ల కొనిస్తరు అని గుచ్చిగుచ్చి అడిగితే… ‘అరె దానిదేముంది ఇన్సూరెన్స్‌ ఉంటది కదా! దాని ద్వారా ఇప్పిస్తం’ అని నలుగురిలో నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఇగ గది ఒడ్సిపోయిన ముచ్చటైంది. గిప్పుడేమో ఉచితాల జపం అందుకున్నడు. తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తే ‘ఉచిత విద్యనందిస్తాం..ఉచిత వైద్యం అందిస్తాం…’ అంటూ గల్లీల్లో చిరువ్యాపారులు అరిసినట్టు అరుస్తున్నడు. అరె గిదేంది? కేంద్రంలో అధికారంలో ఉన్నది వీళ్లే కదా! దేశమంతటా ఉచిత వైద్యం..ఉచిత విద్య అందిస్తమని చట్టం చేస్తే అయిపోతది గదా. సబ్బండ వర్గాలు ఆనందపడ్తయి గదా. గిది అయ్యే పనేనా. గా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కార్పొరేట్లు ఊరుకుంటరా? తమ ధన బలంతోని పువ్వుపార్టీని నలిపేస్తరుగదా! గీ దానిపై బండి అవగాహన లేదనుకోవాలా? లేదు ఉండే ఉంటది. ఎన్నికల తర్వాత ఉచిత వైద్యం.. ఉచిత విద్య ఏది అని ప్రజలు అడిగితే ఇన్సూరెన్స్‌ కథ చెప్తడేమో. అవును సారు మీ మోడీ సారూ ఉచితాలు వొద్దంటున్నడు గదా? ఏందో ఏమో బండి ఏది మాట్లాడినా అన్నీ ధర్మ సందేహాలే.
– గుడిగ రఘు

Spread the love