సాగర్‌ సురక్షితమా…?

Is Sagar safe?– సందర్శించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం
– వారి వెంట ఆంధ్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు
– మూడ్రోజుల పాటు కొనసాగనున్న పరిశీలన
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డ్యామ్‌ను మంగళవారం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. 14, 15వ తేదీల్లో కూడా ఈ పరిశీలన కొనసాగనుంది. బందం సభ్యులు సోమవారం సాగర్‌ విజయవిహార్‌ అతిథి గృహానికి చేరుకున్నారు. వారికి నీటిపారుదల శాఖ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మల్లికార్జున్‌ పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విజయ విహార్‌ అతిథి గృహంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సభ్యులు, సీడబ్ల్యూసీ, కృష్ణా రివర్‌ బోర్డు సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటిపారుల శాఖ అధికారులతో కలిసి సాగర్‌ ప్రధాన డ్యాం, గేట్లు, గ్యాలరీ, కుడికాలువ, హెడ్‌ రెగ్యులేటర్‌, జలవిద్యుత్‌ కేంద్రం, క్రస్ట్‌గేట్లను, 220, 420 గ్యాలరీలను వాక్‌వే మీద నుంచి స్పిల్‌వేను పరిశీలించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలాశయం కెఆర్‌ఎంబి పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేసింది. జలాశయం భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగంపై సమగ్రంగా పరిశీలించి సాగర్‌ డ్యాం జలాశయం వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2009లో వచ్చిన వరదలకు ఎంతమేర నీటి ప్రవాహం వచ్చింది, జలాశయం నుంచి ఎన్ని వేల క్యూసెక్కుల వరదనీరు గేట్ల ద్వారా విడుదల చేశారు.. గేట్ల ద్వారా వరదనీరు విడుదల చేస్తున్న సమయంలో ఏమైనా ఇబ్బంది కలిగిందా అంటూ ఆరా తీశారు. డ్యామ్‌ జలాశయానికి సంబంధించిన ఇన్‌ ఫ్లో, అవుట్‌ ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. జలాశయానికి సంబంధించిన గేట్స్‌, గ్యాలరీ, రోప్స్‌ను పరిశీలించారు. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా.. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ రమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్డీఎస్‌ఏ, కెేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్ర నీటుపారుల శాఖకు సంబంధించిన 13 మంది బృందం సభ్యులు జలాశయాన్ని సందర్శించారు. ఎస్‌డిఎస్‌ఓ చైర్మెన్‌, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ రమేష్‌ కుమార్‌, సిఈ ప్రమీల, ఎస్‌.ఈ శ్రీనివాస్‌, ఈఈ విజయలక్ష్మి, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సీఈ విజరు కుమార్‌, ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జున, డిఈ శ్రీనివాస్‌ రావు, పాపారావు, ఏఈ కృష్ణయ్య, సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుల శాఖ అధికారులు సిఈ మురళీధర్‌ రెడ్డి, ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ శ్రీహరి, డిఈ మురళీధర్‌, సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌, నాగార్జునసాగర్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌, ఇరిగేషన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love